సాక్షిత : నగరపాలక సంస్థ, గృహ నిర్మాణ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాల పురోగతిపై ఉదయం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక అధికారి రామచంద్ర రెడ్డి, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు.
నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయించిన ఐదు జగనన్న లేఔట్ల లో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులు కమిషనర్ కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక ఇంజినీర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని అన్నారు. ముఖ్యంగా జగనన్న కాలనీల్లో మౌళిక సదుపాయాలు అయిన విద్యుత్, నీటి సరఫరా, రోడ్లు వంటివి కొంతమేర ఏర్పాటు చేసినా అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని అన్నారు. స్టేజిల వారీగా బిల్లుల మంజూరు, తదితర అంశాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఇండ్లకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న గృహాలను ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, నగరపాలక సంస్థ, గృహ నిర్మాణ శాఖ డి. ఈ.లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.