అవసరమైతే ప్రత్యేక పదవిని వదిలేస్తా…ఎంపీగా మాత్రం పోటీ చేస్తా : మల్లు రవి
హైదరాబాద్,జోగుళాంబ ప్రతినిధి,: డిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అయినంత మాత్రాన ఎంపీగా పోటీ చేయొద్దని ఎక్కడా లేదని మల్లు రవి అన్నారు. తాను ఎంపీగా పోటీ చేయడానికి పదవి అడ్డు అనుకుంటే వదిలేసుకుంటానని చెప్పారు. వైఎస్ హయాంలోనూ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉంటూనే ఎంపీగా పోటీ చేశానని గుర్తుచేశారు.ఇప్పుడు కూడా పోటీ చేస్తానని సీఎం రేవంత్ కు చెప్పానని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. బుధవారం ఆయన పీసీసీ జన రల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ తో కలిసి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు.
ఏపీకి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న విజయసాయి రెడ్డి ఎంపీగా కూడా ఉన్నారన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధితో పాటు ఎంపీగా కూడా ఉంటే కేంద్ర మంత్రులు,కేబినెట్ సెక్రటరీలను కలిసి రాష్ట్రానికి రావాల్సిన హక్కులను రాబట్టుకునేందుకు సులువు అవుతుందన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఈ నెల 28న ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ సమక్షంలో చార్జ్ తీసుకుంటానని మల్లు రవి తెలిపారు.
వైఎస్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు క్లియరెన్సులపై కీలకంగా పనిచేశానని, ఇప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సహా పలు ప్రాజెక్టుల క్లియరెన్సులను త్వరగా తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొ న్నారు. శబరి హౌస్ పక్కన మూడున్నర గుంటలు, పటౌడీ హౌస్ పక్కన ఐదున్నర ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకుందని,ఆ పైళ్లు ప్రస్తుతం కేంద్ర హోం శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వాటిని క్లియర్ చేస్తే పటౌడి హౌస్ పక్కన స్థలంలో తెలంగాణ భవన న్ను కట్టేందుకు వీలవుతుందని చెప్పారు. దాదాపు 50 ఫైళ్లు తెలంగాణ భవన్లో పెండింగ్ లో ఉన్నాయని. రెసిడెంట్ కమిషనర్ తో చర్చించి పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు.