చేవెళ్ల ఎంపీపీ పార్టీ మార్పు?
కారు దిగి కమలం గూటికి చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి
బీఆర్ఎస్ విధి, విధానాలు నచ్చక బీజేపీలో చేరేందుకు ఆసక్తి వారం రోజుల్లో పార్టీ మారేందుకు రంగం సిద్ధం
చేవెళ్ల రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. ఇదివరకే పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖ రాజకీయ నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
ఇదే తరహాలో చేవెళ్లకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి కారు దిగి కమలం గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు, కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు లేకపోవడంతో అసంతృప్తి సెగలు రగలడంతో పలువురు పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే తరహాలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి తన అనుచరవర్గం, సన్నిహుతులు, నాయకులతో త్వరలోనే బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయినట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏదేమైనా దేశంలో సకల జనుల హితం కోరే మోడీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరడం సఫలీకృతమవడంతో పలు రాజకీయ పార్టీలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నాయనడంలో అతిశయోక్తి లేదని పలువురి విశ్లేషకుల భావన. ప్రస్తుతం చేవెళ్లలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయన్నది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఏ పార్టీ ప్రజల మన్ననలను చూరగొని తిరుగు లేని శక్తిగా అవతరించబోతుందో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.