SAKSHITHA NEWS

ఎన్నికల్లో విజయావకాశాలపై బెట్టింగ్ రాయుళ్లు పందేలు షురూ చేశారు. ఏపీలో ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది, గెలుపోటములపై కాయ్ రాజా కాయ్ అంటున్నారు. గ్రామాల నుంచి నగరాల వరకూ మెజార్టీలపై కోట్లల బెట్టింగ్ కడుతున్నారు.

ఓట్ల జాతర వచ్చింది.. పందెం రాయుళ్లకు పండుగ తెచ్చింది. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? అధికారంలోకి వచ్చేదెవరు? ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ బాబులు రెచ్చిపోతున్నారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై 1:5 చొప్పున అంటే లక్షకు 5 లక్షల రూపాయలు బెట్టింగ్ పెడుతున్నట్లు సమాచారం. పిఠాపురం, భీమవరం, మంగళగిరి, పులివెందుల, కుప్పం స్థానాలపై పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. మంగళగిరిలో గెలిచేదెవరు? కడప ఎంపీ స్థానం దక్కించుకునేదెవరు? భీమిలిలో పరిస్థితి ఏంటి? ఇలా కొన్ని స్పెసిఫిక్‌ స్థానాలపై ఓ రేంజ్‌లో బెట్టింగులు జరుగుతున్నాయట.

కోడిపందేలకు పేరుగాంచిన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ రాయుళ్లు లక్షల్లో కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నట్లు వినికిడి. చోటా నేతలు, కొందరు వ్యాపారులు మధ్యవర్తుల అవతారమెత్తినట్లు చెబుతున్నారు. ఎవరు గెలిచినా తమకు ఒకటి నుంచి 5 శాతం కమీషన్‌ ఇవ్వాలని మాట్లాడుకుంటున్నట్లు చెబుతున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారితోపాటు ప్రైవేటు ఉద్యోగులు, యువకులు, చిరు వ్యాపారులు 50 వేల నుంచి కోటి రూపాయల వరకు పందెం కాస్తున్నారట. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపైనే ఎక్కువగా పందాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకులు, నిత్యం వివాదాలతో చర్చనీయాంశమైన ప్రజాప్రతినిధులు బరిలో ఉన్నచోట భారీగా పందేలు సాగుతున్నాయని సమాచారం. అన్నింటి కంటే పిఠాపురం ఇక్కడ హాట్‌ సీట్‌గా మారిందని టాక్. ఆ తర్వాత ఉండి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున పందెం కాస్తున్నారట. కుప్పం, పులివెందులలో మెజారిటీపై బెట్టింగులు పంటర్లకు కాసులు కురిపించనున్నాయట. గతం కంటే మెజారిటీ తగ్గుతుందని ఒకరు పందెం పెడితే కాదు పెరుగుతుందని మరికొందరు బెట్టింగ్‌ వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

WhatsApp Image 2024 05 12 at 9.31.27 PM

SAKSHITHA NEWS