
విజయవాడ : విజయవాడ ముత్యాలంపాడులోని సాయిబాబా మందిరం అభివృద్ధికి, అక్కడ భిక్షమెత్తుకుంటూ జీవిస్తున్న యాదిరెడ్డి రూ.లక్ష విరాళం అందజేశారు. నగదును శుక్రవారం మందిరం గౌరవాధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా యాదిరెడ్డి మాట్లాడుతూ తాను మందిరం వద్ద భిక్షాటన చేసి సంపాదించిన మొత్తాన్ని స్వామికే ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తన జీవితం బాబాకే అంకితమని, భవిష్యత్తులో తాను సంపాదించిన ప్రతి రూపాయీ దైవకార్యాలకే వినియోగిస్తానని చెప్పారు. ఇప్పటి వరకు యాదిరెడ్డి బాబా మందిరానికి రూ.8.54 లక్షల విరాళం ఇచ్చారని గౌతమ్‌రెడ్డి తెలిపారు. అనంతరం యాదిరెడ్డిని సత్కరించారు.
