సాక్షిత : మునుగోడు నియోజకవర్గంలో మూడున్నర సంవత్సరాలలో చేయని అభివృద్దిని ఇప్పుడు ఎలా చేస్తారో రాజగోపాల్ రెడ్డి చెప్పాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
మునుగోడ్ ఉప ఎన్నికలలో భాగంగా సోమవారం మునుగోడ్ నియోజకవర్గ పరిధిలోని నాంపల్లిలో TRS పార్టీ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడారు. మునుగోడ్ నియోజకవర్గ ప్రజలు MLA గా గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డి గ్రామాలలో పర్యటించలేదని, ప్రజల సమస్యలు తెలుసుకోలేదని విమర్శించారు.
కాంట్రాక్టు లపై చూపిన శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించడం లో చూపించలేదని చెప్పారు. తనను గెలిపిస్తే వెయ్యి కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని ప్రజలను మరోసారి మోసగించే ప్రయత్నం చేస్తున్నారని, ఎక్కడి నుండి తీసుకొస్తారో స్పష్టం చేయాలని అన్నారు. హుజూరాబాద్, దుబ్బాక నియోజకవర్గాల అభివృద్ధి కి మరి ఎందుకు నిధులు తీసుకురాలేదని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలు BJP ని నమ్మే పరిస్థితి లేదని, దీంతో ఎన్నికలలో అడ్డదారిలో గెలవాలని BJP ప్రయత్నిస్తుందని ఆరోపించారు
. మునుగోడ్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది TRS ప్రభుత్వం తోనే సాధ్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అనేక ప్రజా సమస్యలు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో పరిష్కారం అయ్యాయని చెప్పారు. మిషన్ భాగీరధ ద్వారా ఇంటింటికి త్రాగునీటిని అందించి ప్లోరిన్ సమస్య నుండి మునుగోడ్ ప్రజలకు శాశ్వత పరిష్కారం చేసిన ఘనత ముఖ్యమంత్రి KCR గారికే దక్కుతుందన్నారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద పేదింటి ఆడపడుచు పెండ్లికి ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం, పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు. 50 సంవత్సరాల నుండి జరగని అభివృద్ధిని 8 సంవత్సరాల లో చేసిన TRS పార్టీని, KCR నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. ప్రచారంలో TRS కు బ్రహ్మరధం పడుతున్నారని చెప్పారు. TRS అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు తధ్యం అన్నారు. మంత్రి వెంట నాంపల్లి MPTC వెంకన్న గౌడ్, రాష్ట్ర TRS నాయకులు కృష్ణారెడ్డి, సిపిఐ నాయకులు చంద్రమౌళి తదితరులు ఉన్నారు.