రూ.500కే గ్యాస్ సిలిండర్ల’కు 91.49 లక్షలు..
తుదిదశకు చేరిన ఆన్‌లైన్ నమోదు
హైదరాబాద్: ప్రజాపాలన కార్యక్రమంలో అత్యధికంగా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు వచ్చాయి. మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చే ఈ పథకానికి ఎక్కువమంది జైకొట్టారు. ఆ తర్వాత రూ.500కే గ్యాస్ సిలిండర్లకు, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు అందాయి. అభయహస్తం గ్యారంటీలతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలకు అర్జీకి అవకాశం కల్పించగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి.
అందిన అర్జీల్లో 1,09,00,662 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ దాదాపు తుది దశకు చేరింది. జిల్లాల వారీగా అప్‌లోడ్ అయిన దరఖాస్తులన పరిశీలిస్తే.. గ్రేటర్ హైదరాబాద్ నుంచి అత్యధికంగా 18.97 లక్షలు ఉన్నాయి. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 1.37 లక్షలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తు ఫారంలో తమ అర్హతలను బట్టి పలు పథకాలకు అభ్యర్థన పెట్టుకున్నారు. అలా పథకాలవారీగా విభజించి చూస్తే అందిన మొత్తం అభ్యర్థనల సంఖ్య 4,56,35,666 అవుతుంది.