SAKSHITHA NEWS

.674 మీటర్ల పొడవు చాంద్రాయణగుట్ట పైవంతెన ప్రారంభం

హైదరాబాద్: చాంద్రాయణగుట్ట పైవంతెనను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఇవాళ ప్రారంభించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీతో కలిసి మంత్రి రిబ్బన్ కట్ చేశారు.అనంతరం మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తూ అంకిత భావంతో పని చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అన్ని రకాల మౌలిక సదుపాయల కల్పనలో సీఎం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీ పథకం కింద దాదాపు రూ.8వేలకోట్లకు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు వెల్లడించారు.
చాంద్రాయణగుట్ట వద్ద ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రూ. 45.79 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. 4 లైన్లను రెండు వైపుల 674 మీటర్ల పొడవుతో నిర్మించారు. తద్వారా కందికల్ గేట్, బర్కాస్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఆగకుండా నేరుగా ఈ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లవచ్చు. ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ అప్రోచ్ చివరిలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఈ ఫ్లైఓవర్‌ను పొడిగించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్‌కు తక్కువ సమయంలో సులభంగా వెళ్లేందుకు ఈ ఫ్లైఓవర్ దోహదపడుతుంది.


SAKSHITHA NEWS