హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పునర్నిర్మాణ సభ’లో రేవంత్రెడ్డి పాల్గొని సమర శంఖం పూరించారు..
ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..మూడు నెలల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అవుతారని కొందరు అంటున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని అన్నారు. అన్ని వర్గాలను నట్టేట ముంచిన కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి కాదు కదా.. మంత్రి పదవి కూడా రాదన్నారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం. గూడేలకు రోడ్లు, నాగోబా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించాం. ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత తీసుకుంటాం.
1981లో కాంగ్రెస్ వాళ్లే ఇంద్రవెల్లిలో అడవి బిడ్డలను పొట్టనపెట్టుకున్నారని కొందరు విమర్శించారు. ఇంద్రవెల్లి దారుణంపై నేను ఆనాడే క్షమాపణ చెప్పా. సీమాంధ్ర పాలకుల హయాంలో ఆ తప్పు జరిగింది. అప్పుడు జరిగిన తప్పులు సరిచేసేందుకే సోనియా తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను విధ్వంస రాష్ట్రంగా మార్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పు తెచ్చింది. కేసీఆర్ కుటుంబం కోసమే రాష్ట్రం వచ్చిందా? పదేళ్లలో ఏనాడైనా ఇంద్రవెల్లి అడవిబిడ్డల గురించి ఆలోచించారా? సమస్యల పరిష్కారం కోసం ప్రజాగాయకుడు గద్దర్ ప్రగతి భవన్కు వెళ్తే గేటు బయట నిలబెట్టారు. కేసీఆర్కు గద్దర్ ఉసురు తగిలింది. కోటి ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి రూ.వేలకోట్లు దోచుకున్నారు అన్నారు.
కేసీఆర్ పదేళ్లలో ఏమీ చేయలేదు.. మేము 2 నెలల్లో ఎలా చేయగలం? 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మంత్రివర్గం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. త్వరలో రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్నీ అమలు చేస్తాం. రాష్ట్రంలో 2లక్షల పోస్టులు భర్తీ చేసే బాధ్యత మాది. ఇప్పటికే రూ.7వేల ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో, ఎవరు అభివృద్ధి పథంలో నడిపిస్తారో ప్రజలు ఆలోచించాలి. ఈ దేశంలో ఉన్నది రెండే కూటములు.. ఒకటి ఎన్డీఏ, రెండోది ఇండియా కూటమి. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే మోడీ దగ్గర తాకట్టుపెట్టి కేసీఆర్ గులాంగిరి చేస్తారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి” అని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు..