డిసెంబర్ నాటికి గ్రామాల్లో 100 శాతం ఇంటర్నెట్ సేవలు
డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టు పనులు పూర్తి
ఎస్ఐపీబీ పరిశ్రమల కోసం ప్రత్యేక విభాగం
పరిశ్రమలు, మౌళిక సదుపాయాల సమీక్షలో సీఎం జగన్
రాష్ర్టంలోని గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, పాఠశాలలన్నింటికి డిసెంబరు నాటికి 100 శాతం ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలకు 5జీ సేవలను అందించేందకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఫైబర్ నెట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయి క్వాలిటీ ఇంటర్నెట్ సదుపాయలను అందించడంలో ఏపీఎస్ఎఫ్ఎల్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం ఒక ప్రత్యేక బృందం టెలికాం దిగ్గజాలతో కలిసి పనిచేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయని తెలిపారు. వైయస్సార్ జిల్లా వేల్పులలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీలో 30 మంది ఐటీ ఉద్యోగాలు చేస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. పరిశ్రమలు, మౌళిక సదుపాయాల కల్పనపై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఎస్ఐపీబీలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులు వీలైనంత త్వరగా ప్రారంభమయ్యేలా కొత్తగా ఏర్పాటు చేయనున్న అధికారుల బృందం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించే సంస్థలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని ప్రకటించారు.
2023 నాటికి రామాయపట్నం పోర్టు పూర్తి
రామాయపట్నం పోర్టులో డిసెంబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభం అవనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. 2023 డిసెంబరు నాటికి మౌలిక సదుపాయాల కల్పన పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం పోర్టు పనులు నవంబరు నుంచి ప్రారంభిస్తామన్నారు. భావనపాడు పోర్టు పనులును డిసెంబర్ లో మొదలు కావాలని అధికారులకు సూచించారు. రెండో దశలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణంపై ప్రాథమిక పనులు దృష్టిసారించాలని తెలిపారు. కేంద్రం ఇటీవలే మంజూరు చేసిన బల్క్‌డ్రగ్ పార్కు నిర్మాణ ప్రణాళిక సిద్ధమైనట్లు అధికారులు సీఎం జగన్ కు వివరించారు. బల్క్ డ్రగ్పార్కు ప్రాంతంలో కంపెనీలు పెట్టేందుకు ఇప్పటికే మేజర్ ఫార్మా కంపెనీల నుంచి ప్రతిపాదనలు అందాయని పేర్కొన్నారు.
జిల్లాలో 2 ఎంఎస్ఎంఈ క్లస్టర్ల ఏర్పాటు
చిన్నతరహా పరిశ్రమలను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రతిజిల్లాలో 2 క్లస్టర్ల చొప్పున ఎంఎస్ఎంఈలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. పరిశ్రమలు ప్రారంభించేలా సహకరించడంతో పాటు అవి నిలదొక్కుకునేలా పూర్తి సాయం అందిస్తామన్నారు. ఎంఎస్ఎంఈలతో నిరుద్యోగం తగ్గుతుందని పరిశ్రమల ఏర్పాటుతో పాటు నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్‌ను క్రియాశీలం చేయాలని సూచించారు. విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లోని పారిశ్రామిక నోడల్స్‌ను అభివృద్ధి చేయడంతో పాటు మచిలీపట్నం, దొనకొండ నోడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటికి అదనంగా భవిష్యత్తులో రామాయపట్నం నోడ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పోర్టుల ఆధారంగా అనుబంధ పరిశ్రమలకు పెద్ద పీట వేయాలని సీఎం జగన్ సమీక్షలో నిర్ణయించారు. ఇద్దరు లేదా ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విదేశాల్లోని ఎంఎస్ఎంఈల రంగంలో మంచి విధానాలపై పరిశీలన చేసి, వాటిని ఇక్కడ అనుసరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.