
రేవంత్ కు ఏం తెలుసు?… అదొక లొట్టపీసు కేసు: కౌశిక్ రెడ్డి
కేటీఆర్ ప్రపంచాన్ని చూసిన వ్యక్తి అన్న కౌశిక్ రెడ్డి
టెస్లా కంపెనీని తెలంగాణకు తీసుకు రావడమే కేటీఆర్ లక్ష్యమని వ్యాఖ్య
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తమపై కేసులు పెడుతున్నారా? అని ప్రశ్న
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై పనికట్టుకుని కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో అక్రమ కేసు పెట్టారని అన్నారు. కారు రేసు విషయంలో అవినీతి ఎక్కడుందని ప్రశ్నించారు. రుణమాఫీ గురించి ప్రశ్నించినందుకు, తులం బంగారం ఇస్తామన్న దానిపై ప్రశ్నించినందుకు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రశ్నించినందుకు కేసులు పెడుతున్నారా? అని ప్రశ్నించారు.
కేటీఆర్ పై పెట్టిన కేసు ఒక లొట్టపీసు కేసు అని కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ-రేసు కోసం వివిధ రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ ఉందని… అలాంటి పోటీని తట్టుకుని కేటీఆర్ తెలంగాణకు తీసుకొస్తే… రేవంత్ రెడ్డి రద్దు చేశారని మండిపడ్డారు. టెస్లా కంపెనీని తెలంగాణకు తీసుకురావడమే కేటీఆర్ లక్ష్యమని… అందుకే కారు రేసును రాష్ట్రానికి తీసుకొచ్చారని తెలిపారు.
కేసీఆర్ కుటుంబంలో నలుగురు పోతే… రాష్ట్రంలో 60 లక్షల మంది కేసీఆర్ లు తయారవుతారని చెప్పారు. కరీంనగర్ సమావేశంలో తాను ఆర్డీవో గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని… కానీ తనపై ఆరుగురితో కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఖమ్మంలో హరీశ్ రావుపై దాడి జరిగితే కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ ఇచ్చిన బీ ఫామ్ పై గెలిచిని ఎమ్మెల్యే సంజయ్ ను నిలదీస్తే తప్పేముందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తరపున గెలిచి… బీఆర్ఎస్ నే తిడితే తాను ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ బొమ్మ లేకుండా సంజయ్ కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేడని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ప్రపంచాన్ని చూసిన వ్యక్తి అని… రేవంత్ కు ఏమి తెలుసని ప్రశ్నించారు. రేసు విషయంలో మంత్రిగా కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారని… ప్రొసీజర్ తో ఆయనకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. కేసులకు తాము భయపడమని, చట్ట ప్రకారం ఎదుర్కొంటామని చెప్పారు
