SAKSHITHA NEWS

మహిళలను మోసం చేస్తే కాంగ్రెస్ ను మట్టికరిపిస్తాం

మహిళల ఆగ్రహాన్ని చవి చూడకముందే హామీలు అమలు చేయండి

హామీలపై ప్రకటన చేయకపోతే సోనియా గాంధీకి లక్షలాది పోస్టు కార్డులు పంపిస్తాం

మార్చి 8లోపు మహిళలకు ఇచ్చిన హామీలపై ప్రకటన చేయాల్సిందే

మహిళా లోకంతో ఆటలాడుతున్న రేవంత్ రెడ్డి సర్కారు

తప్పుడు హామీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం

పోస్టు కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టిన ఎమ్మెల్సీ కవిత

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 10 వేల పోస్టు కార్డులు పంపిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా లోకాన్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీని మట్టికరిపిస్తామని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీలోగా మహిళలకు నెలకు రూ 2500 ఇవ్వడంతో పాటు అన్ని హామీలపై కార్యాచరణ ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. వరంగల్ లో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవీ పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 10 వేల పోస్టు కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ …హామీల అమలుపై మార్చి 8 లోగా ప్రకటన చేయకపోతే 10 వేల మంది మహిళలం 10 వేల గ్రామాల్లోకి వెళ్తామని, అన్ని గ్రామాల్లో మహిళలకు కూడగట్టి లక్షలాది పోస్టు కార్డులను తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తామని తేల్చిచెప్పారు. “ఏ సోనియా గాంధీ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ మహిళల ఓట్లు వేయించుకుందో…. అదే సోనియా గాంధీకి లక్షలాది పోస్టు కార్డులను పంపిస్తాం” అని స్పష్టం చేశారు. మహిళలకు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదని, మహిళలతో రేవంత్ రెడ్డి సర్కారు ఆటలాడుతోందని, మహిళలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తు చేశారు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో మహిళా అంశాలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.

కాగా. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు… ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంప్ కు పోలిక లేదని విమర్శించారు. “ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు కేవలం పదుల సంఖ్యలో మహిళలకు తప్పా పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశం లేదు. మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాకు ఒక పెట్రోల్ పంపును ఏర్పాటు చేయిస్తే ఆ జిల్లాలో ఉండే వేలాది మంది మహిళా సంఘాల సభ్యులందరికీ పెద్దగా లాభం ఉండదు. కాబట్టి మహిళలకు నెలకు రూ 2500 ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. అప్పుడు ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుంది” అని వ్యాఖ్యానించారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయాలని, ఈ పథకాలన్నింటినీ మార్చి 8న ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

వడ్డీ లేని రుణాలపై ప్రభుత్వం అందంగా అబద్ధాలు చెబుతోందని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఎగ్గొట్టిందని ఆరోపించారు. వడ్డీ లేని రుణాల పరిమితిని రూ 20 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కాబట్టి వడ్డీ రాయితీ బకాయిలు విడుదలతో పాటు రుణ పరిమితిని 20 లక్షలకు పెంచాలని, అభయహస్తం నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్ పంపిణీని నిలిపివేసి కాంగ్రెస్ పార్టీ మానవత్వాన్ని మంటకలిపిందని మండిపడ్డారు.

రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాల శాతం 20 శాతం పెరిగాయని డీజీపీ వెల్లడించారని, ఆడబిడ్డలకు రక్షణపై ప్రభుత్వం సమీక్షించి ప్రకటన చేయాలని సూచించారు. అలాగే, మహిళా కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి అవసరమైన సదుపాయాలు కల్పించడం లేదని, మహిళా కార్మికులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణను ప్రకటించాలని ప్రతిపాదించారు.

అంగన్ వాడీ కార్మికుల జీతాలను పెంచుతామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ఆరోపించారు. అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఢాంబికాలు పలుకుతోందని, కానీ ఆ పోస్టులను కేసీఆర్ హయాంలోనే సృష్టించారని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆడపిల్లలకు ఫీజు రియింబర్స్ మెంట్ చేయడం లేదని, దదాంతో తల్లిదండ్రులు వారిని చదువు మానిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ అన్ని అంశాలపై దృష్టి పెట్టి సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app