SAKSHITHA NEWS

రికార్డ్స్‌’తో ముగిసిన క్రీడా సంబరం…

2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు తెర

ఘనంగా ముగింపు ఉత్సవం

లాస్‌ ఏంజెలిస్‌లో 2028 ఒలింపిక్స్‌

పారిస్‌:

అద్భుత ప్రదర్శనలతో అసామాన్య ఘనతలతో అత్యుత్తమ వేదికగా నిలిచిన పారిస్‌ ఒలింపిక్స్‌కు తెర పడింది. 16 రోజుల పాటు 329 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పతకాల కోసం హోరాహోరీగా పోటీ పడిన తర్వాత 2024 ఒలింపిక్స్‌ పోటీలు ఘనంగా ముగిశాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భిన్నంగా పారిస్‌ నేషనల్‌ స్టేడియంలో సుమారు 70 వేల మంది ప్రేక్షకుల మధ్య ఈ ముగింపు వేడుకలు జరిగాయి.

థామస్‌ జాలీ నేతృత్వంలో ముగింపు ఉత్సవాలను ‘రికార్డ్స్‌’ పేరుతో నిర్వహించారు. ఫ్రాన్స్‌ స్విమ్మర్‌ లియోన్‌ మర్చండ్‌ క్రీడా జ్యోతిని తీసుకొని వేదిక వద్దకు రాగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మాక్రాన్, ఐఓసీ చైర్మన్‌ థామస్‌ బాక్‌ వేదికపై కూర్చున్నాడు. ఫ్రాన్స్‌ జాతీయ గీతాన్ని వినిపించిన తర్వాత అన్ని దేశాల ఫ్లాగ్‌బేరర్లు తమ జాతీయ పతాకాలతో స్టేడియంలోకి అడుగుపెట్టారు.

భారత్‌ తరఫున మనూ భాకర్, పీఆర్‌ శ్రీజేశ్‌ పతాకధారులుగా వ్యవహరించారు. వచ్చే ఒలింపిక్స్‌ 2028లో అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌ నగరంలో జరగనున్న నేపథ్యంలో పారిస్‌ క్రీడల నిర్వాహకులు ఒలింపిక్‌ ఫ్లాగ్‌ను లాస్‌ ఏంజెలిస్‌ క్రీడల చైర్‌పర్సన్‌ కేసీ వాసర్‌మన్‌కు అందజేశారు. ఫ్రెంచ్‌ భాషలో ‘మెర్సీ పారిస్‌’ (థ్యాంక్యూ పారిస్‌) నినాదాలు హోరెత్తుతుండగా ఆఖరి ఘట్టం ముగిసింది.


SAKSHITHA NEWS