
కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణను కూటమిప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది : మాజీమంత్రి ప్రత్తిపాటి
సాక్షిత : ఉత్సవాల నిర్వహణ.. అభివృద్ధి పనులన్నీ అధికారులు కాంట్రాక్టర్లు వెంటనే పూర్తి చేయాలి : పుల్లారావు.
వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాప్రణాళికతో పనిచేయండి : పుల్లారావు.
ప్రభల నిర్వాహకులు పోలీస్.. విద్యుత్.. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ, భక్తులకు ఇబ్బంది లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి : పుల్లారావు.
రాష్ట్ర పండుగ అయిన కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణను కూటమిప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, మహాశివరాత్రినాడు కన్నులపండువుగా జరిగే ఉత్సవాల నాటికి అభివృద్ధి పనులన్నీ పూర్తికావాలని, వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ఆయన జిల్లా ఇంఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనసభ్యులు అరవిందబాబుతో కలిసి ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, నాణ్యతపై పుల్లారావు కాంట్రాక్టర్ ను అడిగి వివరాలు రాబట్టి, పలుసూచనలు చేశారు. కోటప్పకొండ తిరునాళ్లకు రెండు తెలుగురాష్ట్రాల్లో విశేష పేరుప్రఖ్యాతులున్నాయని, శివరాత్రి నాడు భారీసంఖ్యలో భక్తులు తరలివస్తారని, వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొండపైన, దిగువన ఏర్పాట్లు చేయాలని పుల్లారావు అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్డును పరిశీలించిన ఆయన రెండువైపుల ఉన్న మార్జిన్ రోడ్డుకు సమాంతరంగా ఉండేలా, రాళ్లు లేకుండా మట్టి నింపాలని కాంట్రాక్టర్ని ఆదేశించారు. భక్తులు ఘాట్ రోడ్డు ప్రయాణంలో తగు జాగ్రత్తలు పాటించి, నిదానంగా రాకపోకలు సాగించాలన్నారు. కొండపైకి వెళ్లే మార్గంలో ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాల రంగుల పని త్వరగా పూర్తి చేయాలన్నారు. అలానే పిల్లలు ఆడుకునే పార్క్ లోని క్రీడా పరికరాలను బాగుచేయించి, వెంటనే అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కొండపైన..
కింద పార్కింగ్ కు తగిన ఏర్పాట్లు చేయాలని.. వాహనాల రాకపోకలతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు దృష్టిపెట్టాలని, స్వామివారి సేవలు చేసుకుంటూ.. వివిధ రకాల మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎక్కడా నీటిసమస్య లేకుండా చూడాలని ప్రత్తిపాటి ఆలయ అధికారుల్ని ఆదేశించారు. వివిధ సేవాసంస్థలు, దాతలు తిరునాళ్లకు వచ్చే భక్తులకు తాగునీరు..ఆహారం విరివిగా అందిస్తారని, ఆ ఏర్పాట్లలో కూడా ఎక్కడా, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులదేనని పుల్లారావు స్పష్టంచేశారు. అలానే కొండ దిగువన విద్యుత్ ప్రభలు ఏర్పాటుచేసే ప్రదేశాలను పరిశీలంచిన ప్రత్తిపాటి, ప్రభలు నిలపడం మొదలు.. వాటివద్ద జరిగే సాంస్కతిక కార్యక్రమాల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి సమస్యలకు తావులేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభల నిర్వాహకులు పోలీస్.. విద్యుత్.. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ, కార్యక్రమాలన్నీ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని పుల్లారావు సూచించారు. చిలకలూరిపేట కమ్మవురిపాలెంకు చెందిన భక్తుడు చండ్రా శ్రీనివాసరావు కుటుంబసభ్యులతో కలిసి మంత్రి గొట్టిపాటి, మాజీమంత్రి ప్రత్తిపాటి, ఎమ్మెల్యే అరవిందబాబు చేతులమీదుగా త్రికోటేశ్వరునికి బంగారు రుద్రాక్ష హారం అందించారు. స్వామివారిపై తనకున్న విశ్వాసం.. భక్తిని చాటుకున్న శ్రీనివాసరావుని, ఆయన కుటుంబాన్ని ఈ సందర్భంగా ప్రత్తిపాటి ప్రత్యేకంగా అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app