వివాదానికి కారణం కార్యకర్తల అత్యుత్సాహమే: తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు
ఇరువురు నేతలతో మాట్లాడినట్లు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడి
వివాద పరిష్కారం బాధ్యతలను ఇన్ చార్జి మంత్రికి అప్పగించామన్న మహేశ్ కుమార్ గౌడ్
కార్యకర్తల అత్యుత్సాహం కారణంగానే వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం చెలరేగిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పరకాలలో నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు. ఈ వివాదం విషయంలో మంత్రి, ఎమ్మెల్యే ఇరువురితో మాట్లాడినట్లు తెలిపారు. ఈ వివాదంపై ఇరు వర్గాలతో మాట్లాడాలని ఇన్ చార్జి మంత్రికి సూచించినట్లు ఆయన చెప్పారు.
మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి మధ్య వివాదం పార్టీ అంతర్గత సమస్య అని, ఇది త్వరలో సమసిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలానే ఎమ్మెల్యే పోచారం, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి మధ్య కూడా సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. వీరితో చర్చించే బాధ్యతను డీసీసీ అధ్యక్షుడికి అప్పగించామని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకు నష్టం జరగకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.