తెలంగాణా ప్రభుత్వం పేదప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్ద్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి పలు అభివృద్ధి పనులపై GHMC, రెవెన్యూ, HMDA, దేవాదాయ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలు సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అందులో భాగంగా నగరంలోని పలు ప్రభుత్వ శాఖలకు చెందిన స్థలాలలో ఎన్నో సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న నిరుపేదలకు ఆ స్థలాలను కేటాయించాలని నిర్ణయించిన విషయాన్ని చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని జీరా, సోమప్ప మఠం స్థలాల్లో ఎన్నో సంవత్సరాల నుండి నివసిస్తున్న నిరుపేదలు ఆ స్థలంలో తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారని, దేవాదాయ శాఖ కు చెందిన ఈ స్థలాన్ని GHMC కి బదిలీ చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా శ్యామలకుంటలో సుమారు 330 కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాయని, GO 58 క్రింద 2014 లో రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకొన్నారని తెలిపారు. కోర్టు కేసులు ఉన్నందున రెగ్యులరైజేషన్ చేయలేదని పేర్కొన్నారు. వీరు కూడా తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారని చెప్పారు. అవసరమైన చర్యలు చేపట్టి సమస్య పరిష్కారించేలా చూడాలని ఆదేశించారు. రాంగోపాల్ పేట డివిజన్ జీరా కాలనీ లో 134 గృహాలు ఉన్నాయని, 1994 సంవత్సరంలో G.O 816 క్రింద వీరందరు రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. దరఖాస్తు చేసిన సమయంలో ఈ స్థలం విషయంలో సుప్రీం కోర్టులో పలు వివాదాలు పెండింగ్ లో ఉండటంతో ఇండ్ల రెగ్యులరైజేషన్ దరఖాస్తులను పెండింగ్ లో ఉంచడం జరిగిందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సుప్రీం కోర్టులో ఉన్న కేసు 2002 లో లబ్దిదారులకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన G.O 816 గడువు ముగిసినందున ఈ యొక్క దరఖాస్తులు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయని, G.O 816 గడువు ను పొడిగించడం ద్వారా వారికి న్యాయం చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు. అదేవిధంగా చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాలను పరిరక్షించేందుకు ప్రభుత్వ అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. అందులో భాగంగా బన్సీలాల్ పేట లోని నిజాం కాలంనాటి మెట్లబావి పునరుద్దరణ పనులను చేపట్టడం జరిగిందని చెప్పారు. ఇందుకోసం HMDA ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని, ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయినట్లు వివరించారు. మెట్లబావి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు. ఇక్కడకు వచ్చే పర్యాటకుల కోసం వాకింగ్ ట్రాక్, ఫౌంటైన్, వ్యూ పాయింట్ స్కై వాక్, కెఫేటేరియా, బెంచీలు వంటివి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులను నిర్దేశిత ఆగస్టు 15 వ తేదీ నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనులను పరిశీలించేందుకు వచ్చేవారంలో అధికారులతో కలిసి మెట్లబావి ప్రాంతాన్ని పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. MG రోడ్ లోని గాంధీ పార్క్ సుందరీకరణ, నూతన మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు కు సంబంధించిన పనుల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహానికి అదనంగా 16 ఫీట్ల నూతన మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పార్క్ విస్తరణ కోసం స్థల సేకరణ, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు, స్తంభాల తొలగింపు, ప్రస్తుతం ఉన్న నిర్మాణాల తొలగింపు పనులను త్వరగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. నిర్దేశించిన గడువు ఆగస్టు 15 వ తేదీ నాటికి నూతన విగ్రహం ఏర్పాటు, పార్క్ అభివృద్ధి, సుందరీ కరణ పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ శర్మన్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, టౌన్ ప్లానింగ్ CP కమిషనర్, దేవాదాయ శాఖ RJC రామకృష్ణ, సికింద్రాబాద్ RDO వసంత తదితరులు పాల్గొన్నారు.

