
శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు
నేరాలపై నిఘా నేత్రం…!
‘సురక్ష’ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘సురక్ష’ కార్యక్రమంలో భాగంగా 2025 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.వీటి ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్ లో బుధవారం సాయంత్రం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత,డీజీపీ ద్వారకా తిరుమలరావు,విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు,ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య,ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని),సహచర ఎమ్మెల్యేలు కొలికేపూడి శ్రీనివాసరావు,గద్దె రామ్మోహన్,యలమంచిలి సుజనా చౌదరి,బొండా ఉమామహేశ్వరరావు,శ్రీ రాం రాజగోపాల్ తో కలసి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుఉత్తమ పోలీసింగ్ ఇవ్వడానికి విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
శాసన వ్యవస్థ,పోలీసు వ్యవస్థ కలసి పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో అని చెప్పడానికి విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఒక నిదర్శనం అన్నారు.ట్రాఫిక్ విషయంలో కూడా మెరుగైన చర్యలతో ట్రాఫిక్ జామ్ కాకుండా,జంక్షన్ల క్రాసింగ్ల వద్ద ఎక్కువ సమయం పట్టకుండా చర్యలు తీసుకున్నారన్నారు.అలాగే విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుదన్నారు.పోలీసు శాఖ సమర్ధవంతంగా పనిచేస్తోందన్నారు.ప్రజలను రక్షించడంలో డ్రోన్స్,సీసీ కెమెరాల వంటి నూతన టెక్నాలజీ వినియోగం అవసరం అన్నారు.సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయటంలో పోలీసులు సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.
