
బీచ్ ఫెస్టివల్‌లో క్రీడలకు విశేష ఆదరణ
** 10లక్షల మందికిపైగా విచ్చేసిన పర్యాటకులు
** శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు
సాక్షిత ప్రతినిధి – విజయవాడ : రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మచిలీపట్నంలోని మసులా బీచ్ ఫెస్టివల్‌లో నిర్వహించిన జాతీయ జల క్రీడలకు విశేష ఆదరణ లభించిందని “శాప్” ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. కనీవినీఎరుగని రీతిలో 15 లక్షల మంది పర్యాటకులు, వీక్షకులు హాజరవడం సంతోషదాయకమన్నారు. విజయవాడలోని శాప్ ప్రధానకార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో మసులా బీచ్ ఫెస్టివల్ క్రీడాపోటీల విజేతలు, నిర్వాహకులను ప్రశంసిస్తూ ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్‌తోపాటు శాప్ ఎండీ పీఎస్.గిరీషా పోటీల్లో గెలుపొందిన ఏపీ క్రీడాకారులకు, క్రీడలు నిర్వహించిన శాప్ అధికారులను, సిబ్బందిని, అసోసియేషన్ల నిర్వాహకులను సత్కరించారు. తొలుత బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, కెనాయింగ్ అండ్ కయాకింగ్ జాతీయ పోటీల్లో ఏపీ తరుపున తలపడి పతకాలు సాధించిన విజేతలను సత్కరించడంతోపాటు ఆర్థిక ప్రోత్సాహకాలను అందజేశారు. అనంతరం క్రీడాపోటీలను విజయవంతంగా పూర్తిచేసిన శాప్ అధికారులు, డీఎస్డీఓలు, కోచ్‌లు, సిబ్బందిని దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్‌లో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడల నిర్వహణ పట్ల ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీకి మరింత గౌరవం లభించిందన్నారు. అంచనాలకు మించి 15 లక్షల మంది వరకూ హాజరయ్యారన్నారు. బీచ్ ఫెస్టివల్‌లో జాతీయస్థాయి పోటీలను నిర్వహించడం సరికొత్త అధ్యయనమని వివరించారు. శాప్ అధికారులు, డీఎస్డీఓలు, కోచ్‌లు, అసోసియేషన్ల నిర్వాహకుల సమిష్టి కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి క్రీడాపోటీలు మరిన్ని నిర్వహించాలన్నారు. అలాగే క్రీడల విజయవంతంలో అసోసియేషన్ల చొరవ ప్రశంసనీయమన్నారు. క్రీడాకారులకు, కోచ్‌లకు, అసోసియేషన్లకు ఆర్థిక ప్రోత్సాహకాలను విడివిడిగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కృష్ణా జిల్లాలో క్రీడల అభివృద్ధిపై మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు.
క్రీడాకారులకు అండగా శాప్..
శాప్ ఎండీ పీఎస్ గిరీషా మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్‌లో వాటర్ గేమ్స్ విజయవంతంగా జరిగాయన్నారు. అలాగే పోటీల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల ప్రదర్శన భేష్ అన్నారు. ప్రతీ ఏటా ఇదే మాదిరిగా స్పోర్ట్స్ అథారిటీ క్రీడలను నిర్వహించాలన్నారు. క్రీడలు, క్రీడాకారులకు శాప్ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. బీచ్ ఫెస్టివల్ విజయవంతంలో అసోసియేషన్లను భాగస్వామ్యులను చేసిన శాప్ ఛైర్మన్ చొరవ హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ ఏఓ ఆర్.వెంకటరమణ నాయక్, టీఎస్ఓ ఎస్వీ రమణ, ఎస్ఓలు కోటేశ్వరరావు, మహేష్, సురేంద్ర, కిషోర్, ఏడీ వేణు, అసోసియేషన్ల నిర్వాహకులు పాల్గొన్నారు.
