రాష్ట్రంలో సైకిల్ పాలన కావాలంటున్న ప్రజలు

Spread the love

People who want cycle rule in the state

రాష్ట్రంలో సైకిల్ పాలన కావాలంటున్న ప్రజలు

పోలవరం సందర్శనకు అనుమతి నిరాకరణ దారుణం – ప్రాజెక్ట్ దగ్గరకు 28సార్లు వచ్చి 63 సమీక్షలు జరిపారు

పోలవరం వెళ్ళే అర్హత చంద్రబాబుకు లేదనడం సరికాదు

పోలవరాన్ని పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

కొవ్వూరు, నిడదవోలు, రాష్ట్రంలో సైకో పాలన వద్దని, సైకిల్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. చంద్రబాబు పాలన వస్తేనే ప్రజలందరి జీవితాలు ఆనందంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా 3వ రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొవ్వూరులో చంద్రబాబుకు శిష్ట్లా లోహిత్ అభివాదం చేశారు. అక్కడి నుండి చంద్రబాబు రోడ్ షోను నిర్వహించారు. నిడదవోలు చేరుకుని అక్కడ బహిరంగ సభ అనంతరం రోడ్ షోగా బయలుదేరి తాడేపల్లిగూడెం చేరుకున్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే టీడీపీ నేతలందరినీ శిష్ట్లా లోహిత్ కలుసుకున్నారు. అనంతరం శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించేందుకు చంద్రబాబుకు అనుమతిని నిరాకరించడం దారుణమన్నారు. ప్రాజెక్ట్ కు వెళ్ళే దారిలో బారిగేట్లు, వ్యాన్ లు అడ్డుపెట్టి రహదారిని మూసివేశారన్నారు.

దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారన్నారు. చంద్రబాబుతో పాటు మరో ఐదుగురు నేతలకు అనుమతి ఇవ్వాలని కోరినా పోలీసులు అంగీకరించలేదన్నారు. ప్రాజెక్ట్ దగ్గరకు ఎందుకు వెళ్ళకూడదో లిఖితపూర్వకంగా రాసివ్వాలని చంద్రబాబు అడిగినప్పటికీ పట్టించుకోలేదన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు చంద్రబాబు 28సార్లు వచ్చారని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్ట్ పై 63సార్లు సమీక్ష జరిపారన్నారు. అలాంటి చంద్రబాబుకు పోలవరం వెళ్ళే అర్హత లేదని ఆపడం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతం నిషేధిత ప్రాంతం కాదని, దేశంలో ఎవరైనా సందర్శించే హక్కు ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు బయటపడతాయన్న భయంతోనే చంద్రబాబును అడ్డుకోవడం జరిగిందన్నారు.

రివర్స్ టెండరింగ్ పేరుతో అవినీతికి పాల్పడ్డారని, ప్రాజెక్ట్ నిర్వహణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పురోగతి సాధించలేదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్ట్ పురోగతిని వివరించేందుకు ఉచితంగా బస్సులను ఏర్పాటు చేసి ప్రజలకు చూపించడం జరిగిందన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 72శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్ట్ ఒక వరమని అన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే రాష్ట్రానికి కరువు ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం జరుగుతుందని శిష్ట్లా లోహిత్ చెప్పారు.

Related Posts

You cannot copy content of this page