
రోజా కామెంట్స్ పై నారా లోకేశ్ ఫన్నీ కౌంటర్.. దావోస్ ప్రతినిధులుకూడా అదే విషయాన్ని అడుగుతున్నారట. .ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ బృందం ఇటీవల దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొని పలు కంపెనీల ప్రతినిధులు, సీఈవోలతో సమావేశం అయిన విషయం తెలిసిందే.అయితే, చంద్రబాబు, లోకేశ్ దావోస్ పర్యటనపై మాజీమంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా విమర్శలు చేశారు. పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, చంద్రబాబు ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి తిరిగి వచ్చారంటూ కామెంట్స్ చేశారు. రోజా కామెంట్స్ పై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ ఫన్నీకామెంట్స్ చేశారు. సోమవారం లోకేశ్ విశాఖలో పర్యటించారు. ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఆయన వేసిన పరువు నష్టం దావా కేసులో విశాఖ కోర్టులో ఇవాళ లోకేశ్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.2019లో ఓ పత్రిక నాపై అసత్య కథనం ప్రచురించిందని, తప్పుడు కథనంపై సమాధానం చెప్పాలని అప్పుడే నేను లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగిందని లోకేశ్ చెప్పారు. యువగళం పాదయాత్రపై మాట్లాడుతూ..
రాజకీయాల్లో పాదయాత్ర ఎంబీఏ లాంటిది. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుంది. విశాఖలో జరిగిన అక్రమాలపైనా విచారణ జరుగుతుంది. అన్ని వ్యవహారాలపై విచారణ ఒకేసారి జరిగితే ఉన్న పోలీసులు సరిపోరు.. అన్నింటిపైన విచారణ కచ్చితంగా జరుగుతుందనిలోకేశ్ తెలిపారు.ఏడు నెలల్లో ఆరు లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు తీసుకొచ్చాం.. ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకువచ్చామని లోకేశ్ చెప్పారు. చంద్రబాబు నాయుడు 1997 నుంచి దావోస్ వెళ్తున్నారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో ఒప్పందాలు జరిగితే ఎందుకు పరిశ్రమలు స్థాపించలేక పోయారని లోకేశ్ ప్రశ్నించారు. మహారాష్ట్రకు ఎక్కువ పెట్టుబడులు రావడానికి కారణం ఒకే ప్రభుత్వం కొనసాగడం. గుజరాత్ లో 5వ సారి బీజేపీ ప్రభుత్వం రావడం వలన ఆ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని లోకేశ్ చెప్పారు. ఏపీలో 2014 నుంచి 2019 వరకు అభివృద్ధిని పరుగులు పెట్టించాం. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల ప్రతినిధులను గతంలో జగన్ మోహన్ రెడ్డి కలవలేదని లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుస్తుందని లోకేశ్ అన్నారు.చంద్రబాబుపై మాకు నమ్మకం ఉంది.. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవలేరు అని హామీ ఇవ్వగలరా అని దావోస్ ప్రతినిధులు అడుగుతున్నారని లోకేశ్ చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. పారిశ్రామిక వేత్తలను రాష్ట్రానికి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నామని అన్నారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు రోజా కామెట్స్ పై ప్రశ్నించగా.. రోజాకు దావోస్ కు జ్యూరీచ్ కు తేడా తెలిదు అంటూ లోకేశ్ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. రెడ్ బుక్ కోసం ఎందుకు వైసీపీ నాయకులు భయపడుతున్నారని అన్నారు. విశాఖలో 90 రోజుల్లో టీసీఎస్ ను ఏర్పాటు చేస్తామని లోకేశ్ చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app