నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నేటితో 70 వసంతాల పూర్తి
ప్రపంచ రాతి నిర్మాణాల ప్రాజెక్టుల్లోకెల్లా ప్రథమస్థానం
ప్రపంచప్రఖ్యాతి గాంచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి నేటి (డిసెంబర్ 10)తో 69 వసంతాలు పూర్తిచేసుకుంది. ఆంధ్రరాష్ట్ర అన్నపూర్ణగా రైతులపాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10న డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు రూపకల్పనకు ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు, ముత్యాల జమీందార్ మహేశ్వరప్రసాద్ ఆలోచనలు మూలంగా చెప్పవచ్చు. ప్రాజెక్టు నిర్మాణానికి వేలాది మంది శ్రమజీవుల శ్రమశక్తి, వందలాది మంది ప్రాణార్పణలు నేటికీ మరువలేనివి. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1970లో పూర్తయింది. డ్యాం నిర్మాణ దశలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొట్టమొదటి చీఫ్ ఇంజనీరుగా పనిచేసిన మీర్‌జాఫర్ అలి నిబద్ధత కొనియాడదగింది. ప్రపంచ రాతినిర్మాణాల ప్రాజెక్టుల్లోకెల్లా నాగార్జునసాగర్ డ్యాం పొడవు, ఎత్తుల్లో ప్రథమస్థానంలో ఉండడం విశేషం! నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఇది 285 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి 408 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని కలిగివుంది. గత 44 ఏళ్లుగా వచ్చిన వరదలకు రిజర్వాయర్‌లో పూడిక చేరడంతో సాగర్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 312 టీంఎసీలుగా ప్రభుత్వం నిర్ధారించింది. అంటే సుమారు 96 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని రిజర్వాయర్ కోల్పోయింది.
జవహర్ కెనాల్ కుడికాలువకు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1956 అక్టోబర్ 10న శంకుస్థాపన చేశారు. అనంతరం ఈకాలువకు అ ప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న నీటిని విడుదలచేసి జాతికి అంకితమిచ్చారు. దీనిని జవహర్ కెనాల్ అని పిలుస్తారు. ఈ కాలువ గుంటూరు, ప్రకాశం జిల్లా లో సుమారు 203కి.మీ. ప్రవహిస్తూ రైతన్నల ఆశాజ్యోతిగా వెలుగొందుతోంది. ఈ కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు నీరందుతోంది. ఈ కాలువ కింద ఆయకట్టును 22 బ్లాకులుగా విభజించారు. వీటికి 9 బ్రాంచ్ కెనాల్స్ కలిగి 5342 కి.మీ. పంటలకు నీటిని అందిస్తోంది. దీనికితోడు ఫీల్డ్‌చానల్స్ ద్వారా 14,400 కి.మీ. పంటలకు నీరు అందుతోంది.
లాల్‌బహుదూర్ కెనాల్ జై జవాన్.. జై కిసాన్ అని నినాదించిన మాజీ ప్రధాని లాల్‌బహుదూర్ శాసి్త్ర జ్ఞాపకార్థం సాగర్ ఎడమ కాలువకు లాలా బహుదూర్ కెనాల్ అని నామకరణం చేశారు. ఈ కాలువకు 1959లో అప్పటి రాష్ట్ర గవర్నర్ భీమ్‌సేన్ సచార్ శంకుస్థాపన జరుపగా కుడి కాలువతోపాటే ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న ప్రారంభోత్సవం చేశారు. ఈ కాలువ ద్వారా 10.38 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తోంది. మొత్తం 297కి.మీ. పరిధిలోని పొలాలకు సాగునీరు అందుతోంది. దీనికున్న 7బ్రాంచ్ కాలువల ద్వారా 7722 కి.మీ., ఫీల్డ్ చానల్స్ ద్వారా 9654 కి.మీ. పంట పొలాలను సస్యశ్యామలం చేస్తుంది. వీటికితోడు 26 క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలయ్యే నీటితో కృష్ణాడెల్టా ప్రాంత రైతులకు పంట లు పండించేందుకు ఉపయోగకరంగా ఉంది.
జలవిద్యుత్కేంద్రాలు నాగార్జునసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సేద్యపు నీటినే కాకుండా జలవిద్యుదుత్పత్తి చేసే కేంద్రంగా కూడా ప్రాధాన్యం పొందింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై నిర్మించిన 410 మెగావాట్ల ప్రధాన జలవిద్యుత్కేంద్రం, కుడి కాలువపై 90 మెగావాట్ల జలవిద్యుత్కేంద్రం, ఎడమ కాలువపై 60మెగావాట్ల జలవిద్యుత్కేంద్రాలను నిర్మించారు. వీటికితోడు కుడికాలువపై హైడల్ పవర్ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రాష్ట్రంలో సాగు, తాగునీటితోపాటు విద్యుత్ కొరతను కూడా తీరుస్తోంది. అందుకే దీనిని బహుళార్థ సాధక ప్రాజెక్టు అని కూడా అంటారు.
ప్రపంచ పర్యాటక కేంద్రంగా… నాగార్జునసాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా కూడా పేర్గాంచింది. కృష్ణానది లోయలో మహాయాన బౌద్ధమత విస్తరణకు ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన యూనివర్సిటీ ప్రపంచంలో బౌద్ధ మత వ్యాప్తికి ఎంతో దోహదం చేసింది. క్రీస్తు శకం రెండవ శతాబ్ధంలోని శాతవాహన కాలంనాటి జీవనశైలి, మూడవ శతాబ్ధం నాటి ఇక్ష్వాకుల రాజధానిగా విజయపురి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఏకైక ఐలాండ్ మ్యూజియంగా ఉన్న నాగార్జునకొండ, అనుపు, ఎత్తిపోతల, ప్రధాన జలవిద్యుత్కేంద్రాలను, కుడి, ఎడమ కాలువలను, మోడల్ డ్యాంను చూసేందుకు ప్రతిరోజూ వందలాది మంది దేశవిదేశీ పర్యాటకులు నాగార్జునసాగర్ రావడంతో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది.