
ఎమ్మెల్యే మాటలు రహస్యంగా రికార్డింగ్ చేసిన కార్యదర్శి
ఆయన ఓ గ్రామ కార్యదర్శి. పేరు బి.వెంకటేశ్వరరావు. ఇటీవల బదిలీల్లో కంకిపాడు మండలం నుంచి పెనమలూరు మండలం గంగూరు వచ్చి పారిశుద్ధ్య కార్మికులను వేధించడం, సచివాలయ ఉద్యోగులను సాధించడం ఆరంభించారు.
దీంతో పారిశుద్ధ్య కార్మికులు కొద్దిరోజుల కిందట నేరుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే సర్పంచితో పాటు ఏ అధికారిని ఖాతరు చేయకపోవడంతో ఇతని బాధితులు పెరిగిపోయారు. గత మూడు నెలలుగా సచివాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి.. వెంకటేశ్వరరావుకు విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఈ వ్యవహారం కూడా ఎమ్మెల్యే బోడే దృష్టికి వెళ్లింది. ఆ ఉద్యోగి ఫిర్యాదు మేరకు కార్యదర్శి వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే తన కార్యాలయానికి పిలిపించి వివరణ కోరారు.
ఈ సందర్భంలో కార్యదర్శి రహస్యంగా, ఎవరికీ అనుమానం రాకుండా ఎమ్మెల్యే కౌన్సెలింగ్‌ను తన సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి చొక్కాజేబులో పెట్టుకోవడాన్ని కార్యాలయంలో ఉన్న ఓ తెదేపా కార్యకర్త గమనించాడు. కార్యదర్శితో పాటు ఉద్యోగికి కౌన్సెలింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే బోడే జాగ్రత్తగా విధులు నిర్వహించుకోవాలంటూ వారికి స్పష్టం చేశారు. అనంతరం కార్యదర్శి వెంకటేశ్వరరావు బయటకు వెళ్లేందుకు బయల్దేరగా తెదేపా కార్యకర్త ఈ వీడియో రికార్డింగ్ వ్యవహారాన్ని ఎమ్మెల్యేకు చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. దీంతో పోరంకి, పెనమలూరులకు చెందిన తెదేపా నేతలు కార్యదర్శిని పట్టుకొని ఫోన్ పరిశీలించగా వీడియో రికార్డింగ్ వాస్తమేనని తేలింది. ఈ రికార్డింగ్‌ను వీరు తొలగించారు.
దీర్ఘకాలిక సెలవులోకి కార్యదర్శి: దీంతో వ్యవహారం మండల, జిల్లా అధికారుల వరకు వెళ్లింది. ఈ క్రమంలో కార్యదర్శిని మందలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాలుగు రోజుల కిందట కార్యదర్శి వెంకటేశ్వరరావును ఉన్నతాధికారులు దీర్ఘకాలిక సెలవులో సాగనంపినట్లు సమాచారం. ఇతని స్థానంలో గతంలో ఇక్కడ పనిచేసిన కార్యదర్శి సుబ్బారావు(ప్రస్తుతం ఉయ్యూరు మండలం చిన ఓగిరాలలో పనిచేస్తున్నారు)ను ఇన్‌ఛార్జి కార్యదర్శిగా నియమించారు.
