పశుగణన పారదర్శకంగా నిర్వహించాలి
తప్పులకి ఆస్కారం లేకుండా అంతర్జాలంలో నమోదు చేయాలి : జిల్లా కలెక్టర్
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: పశుగణన పారదర్శకంగా నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 21 వ జాతీయ పశు గణనను జిల్లా పశు సంవర్ధక అధికారి శ్రీనివాసరావు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జ్యోతి ప్రజ్వలన చేసి, పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పశుగణన ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక్కసారి లెక్కిస్తారని జిల్లాలో 21 వ జాతీయ పశు గణన 25 అక్టోబర్ 2024 నుండి 02 ఫిబ్రవరి 2025 వరకు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లా పశు సంవర్దన అధికారి నోడల్ అధికారిగా, 37 మంది డాక్టర్లు సూపర్ వైజర్లు గా, 139 ఎన్యూమరేటర్స్ గా పశు సంవర్ధక సహాయకులు,పారా సిబ్బంది, గోపాల మిత్రులు ఉంటారని
తెలిపారు.గేదెలు,ఆవులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు, కోళ్లు, పందులు, గాడిదలు, గుర్రాలు, బాతులు, కుక్కలు, కుందేళ్లు లాంటి 16 రకాల పెంపుడు జంతువుల సమాచారన్ని జాతుల వారీగా సేకరిస్తారన్నారు. పశు గణనకి సంబంధించి ఎలాంటి తప్పులకి అవకాశం లేకుండా ఖచ్చితంగా లెక్కించాలని ప్రతి ఇంటికి క్షేత్ర స్థాయి లో వెళ్ళి పశువులను లెక్కించి అక్కడే అంతర్జాలంలో నమోదు చేయాలని, అలాగే పోలీస్ స్టేషన్స్ లో, చర్చి లలో, మసీద్ లలో కుక్కులు పెంచుతారని అలాగే దేవాలయాల గోశాల ఆవులని అలాగే డైరీ ఫారం లలో ఉన్న పశువులను ఎ ఒక్కటి వదలకుండా జాతుల వారీగా లెక్కించాలని అన్నారు. ప్రభుత్వం భవిష్యత్ లో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు పశు గణన ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.పశుగణన చేయటం ద్వారా పిడుగులు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పారదర్శకంగా సహాయ సహకారాలు అందించే విషయం లో చాలా ఉపయోగపడుతుందని అలాగే పశువులపై ఆధారపడి జీవించే కుటుంబాల జీవనోపాదికి తోడ్పడేలా కార్యక్రమాల రూపాకల్పనకు ఉపకరిస్తుందన్నారు.
పశువులు ఉదయం 11గంటల తర్వాత పశుగ్రాసం కొరకు బయటకు వెళ్తాయి కాబట్టి పశుగణన ఉదయం పూటనే ప్రారంభించాలని, గ్రామం లో ఒక చివరి నుండి మరో చివరకు ఒక్క ఇంటిని కూడా వదలకుండా లెక్కించుటకు ప్రణాళికలు తయారు చేసుకోవాలని, రోజు వారి గణన కి సంబందించి నివేదిక అందించాలని తెలిపారు.గ్రామ స్థాయి లో ఉండే పంచాయతీ కార్యదర్శి, మల్టి పర్పస్ వర్కర్ లను, స్వయం సహాయక బృందాల మహిళలలను అవసరం ఉన్న చోట సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎడి డాక్టర్ వెంకన్న, డాక్టర్ పెంటయ్య, జిల్లాలోని డాక్టర్లు,పశు సంవర్ధక సహాయకులు,పారా సిబ్బంది, గోపాల మిత్రులు,
సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.