SAKSHITHA NEWS

Light of the Eye’ A program involving humanity

మానవత్వం ఇమిడి ఉన్న కార్యక్రమం ‘కంటి వెలుగు’.

దృష్టి లోపం లేని సమాజాన్ని నిర్మించడం ప్రభుత్వ బాధ్యత.

ప్రజలతో మమేకమై అందరి జీవితాల్లో వెలుగులు నింపాలనేదే కేసిఆర్ ప్రభుత్వ లక్ష్యం.

అట్టహాసంగా కంటి వెలుగు, బస్తీ దావాఖన ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ :

దృష్టి లోపాలను దూరం చేసి, అంద రహిత సమాజాన్ని నిర్మించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం మానవత్వం ఇమిడి ఉన్న గొప్ప కార్యక్రమమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాత మున్సిపల్ కార్యాలయం భవనం నందు ఎర్పాటు చేసి ప్రారంభించారు. అక్కడే నూతనంగా ఎర్పాటు చేసిన బస్తీ దావాఖనను ప్రారంభించారు. అనంతరం రఘునాధపాలెం మండలం బుడిడంపాడు గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, కంటి వెలుగు కార్యక్రమం మానవతా దృక్పథంతో రూపొందించిన కార్యక్రమం అని, ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా, గిన్నిస్ రికార్డును నమోదు చేసే తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఆలోచనాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అన్నారు. ప్రస్తుత సమాజంలో సామాజిక రుగ్మతగా మారిన కంటి సమస్యను పారద్రోలాలనే కృత నిశ్చయంతో 2018 లోనే కంటి వెలుగుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి గుర్తు చేశారు.

తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 50 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహిస్తే, మూడొంతుల మంది కంటి జబ్బులతో బాధ పడుతున్నారని నిర్ధారణ అయ్యిందని, యాభై లక్షల మందికి కంటి అద్దాలు అందించడం జరిగిందని వివరించారు. ప్రస్తుతం రెండవ విడతలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేసేలా విస్తృత చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 12 లక్షల పైచిలుకు మందికి స్క్రీనింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, వంద రోజుల పాటు ఈ శిబిరాలు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో కొనసాగుతాయని తెలిపారు.

కంటి వెలుగు శిబిరాల్లో ప్రతి ఒక్కరికి నాణ్యమైన సేవలందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. శారీరక అవయవాలన్నింటిలో అతి ప్రధానమైన కంటి చూపును కోల్పోతే ఎదురయ్యే ఇబ్బందులు వర్ణనాతీతమని అన్నారు. ఏ.ఎన్.ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరాల్లో నేత్ర పరీక్షలు నిర్వహించుకునేలా చొరవ చూపాలన్నారు. అన్ని వర్గాల వారు భాగస్వాములై కంటి వెలుగును విజయవంతం చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం వంద రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆసుపత్రులకు వెళ్లి కంటి పరీక్ష చేయించుకునే వెసులుబాటు లేనివారికి కంటి వెలుగు శిబిరాలు ఎంతో గొప్ప అవకాశంగా నిలుస్తాయని, వీటిని పూర్తి స్థాయిలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ , మేయర్ పునుకొల్లు నీరజ , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీ ఎం & హెచ్ ఓ మాలతి, సుడా చైర్మన్ విజయ్, ఎంపీపీ మాలోత్ గౌరి, సర్పంచ్ మీరా సాహెబ్, డాక్టర్ నిలోహన, తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS