SAKSHITHA NEWS

తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌..!!

ఆరు నెలల తర్వాత పార్టీ కార్యాలయానికి..

పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై దిశా నిర్దేశం

హైదరాబాద్‌: ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు రానున్నారు.

తెలంగాణ భవన్‌లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్లు కలుపుకొని సుమారు 400 మందికి ఆహ్వానం పంపారు.

ఈ భేటీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు చేపట్టాల్సిన రాజకీయ కార్యకలాపాలపై కేసీఆర్‌ దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పేరిట ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ వచ్చే ఏప్రిల్‌ 27 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుండటంతో సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే రెండు నెలల పాటు పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపేలా సన్నాహక కార్యక్రమాలు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూలు ప్రకటించే అవకాశముంది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app