ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సికింద్రాబాద్ లోని కుమ్మరిగూడ లో గల శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ పూజలలో పాల్గొన్నారు. ముందుగా పండితులు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించిన అనంతరం నిర్వహకులు శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎంతో ప్రశాంతంగా ఉండే సికింద్రాబాద్ ప్రాంతంలో ని అమ్మవారి ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటన దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో 5, 6 రోజుల పాటు ఈ ప్రాంతం మొత్తం భయానకర పరిస్థితులు ఉండేనని అన్నారు.
ఒకరి మనోభావాలు వారికి ఉంటాయని..వాటిని దెబ్బతీసే అధికారం ఎవరికి లేదన్నారు. ఎంతో భక్తితో కొలుచుకునే అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనతో బస్తీవాసులు కూడా తీవ్ర ఆగ్రహానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. భక్తుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నూతన విగ్రహ ప్రతిష్ఠ కోసం తాను చర్యలు చేపట్టగా, అదే సమయంలో ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం ముందుకొచ్చిందని వివరించారు. ప్రజల సంతోషమే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు సమాజానికి మంచిది కాదని, పునరావృతం కాకుండా దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. MLA వెంట మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డివిజన్ BRS అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, మహేష్ యాదవ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.