SAKSHITHA NEWS

ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

పోలింగ్ స్టేష‌న్లలో ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ : ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.
ఈ నెల 27న కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ఏర్పాట్ల ప‌రిశీల‌న‌లో భాగంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ న‌గ‌రంలోని ప‌ట‌మ‌ట బాలుర ఉన్న‌త పాఠ‌శాల‌, ల‌యోలా క‌ళ‌శాల‌లోని వివిధ పోలింగ్ స్టేష‌న్ల‌ను త‌నిఖీ చేశారు. ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా చేయాల్సిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఓట‌ర్ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. విద్యుత్‌, తాగునీరు, మ‌రుగుదొడ్లు వంటి సౌక‌ర్యాల క‌ల్ప‌న విష‌యంలో ఎలాంటి లోటుపాట్లు ఉండ‌కూడ‌ద‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు.

ప్ర‌లోభాల‌కు తావులేని, స్వేచ్ఛాయుత‌, శాంతియుత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయ‌డం జ‌రుగుతోంద‌ని.. ఇందులో భాగంగా వివిధ పోలింగ్ స్టేష‌న్ల‌ను సంద‌ర్శించి.. చేయాల్సిన ఏర్పాట్ల‌పై అధికారుల‌కు సూచ‌న‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, వెబ్‌క్యాస్టింగ్ త‌దిత‌రాల‌పైనా మార్గ‌నిర్దేశ‌నం చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. జిల్లాలో మొత్తం 112 పోలింగ్ స్టేష‌న్లు ఉన్నాయ‌ని.. ఒక్కో పోలింగ్ స్టేష‌న్‌కు ఒక‌రు చొప్పున మొత్తం 112 మంది మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల‌ను నియ‌మించి శిక్ష‌ణ కూడా ఇచ్చిన‌ట్లు తెలిపారు. అన్ని పోలింగ్ స్టేష‌న్ల‌లోనూ వెబ్‌క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. త‌నిఖీల్లో క‌లెక్ట‌ర్ వెంట విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య త‌దిత‌రులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app