హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్ బదిలీ..

Spread the love

Hyderabad traffic chief Ranganath transfer

హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్ బదిలీ..

వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: నగర ట్రాఫిక్‌ విభాగం సంయుక్త పోలీసు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ బదిలీ అయ్యారు. ఆయనను వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ ఎస్పీగా పని చేస్తూ డీఐజీగా పదోన్నతి పొందిన రంగనాథ్‌ గతేడాది డిసెంబర్‌ 29న సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.

నల్లగొండకు వెళ్లే ముందూ ఆయన సిటీ ట్రాఫిక్‌ డీసీపీగా పని చేశారు. రోడ్డు ఆక్రమణల నిరోధం కోసం నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాల మేరకు అమలులోకి వచ్చిన ఆపరేషన్‌ రోప్‌లో రంగనాథ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తున్న వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు, తప్పుడు నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై చర్యలు, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు, మలక్‌పేట్‌ వద్ద మూడో మార్గం పనుల వేగవంతం… ఇలా నగర ట్రాఫిక్‌పై రంగనాథ్‌ తనదైన ముద్ర వేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ లోక్‌ అదాలత్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించేలా చేశారు.

ట్రాఫిక్‌ విభాగంలోనూ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహణ, జంక్షన్లలో డైరీలు ఏర్పాటు, అడ్డదిడ్డంగా సంచరిస్తున్న అంబులెన్స్‌ల క్రమబద్దీకరణ, జంక్షన్లలో గ్రీన్‌ లైట్‌ వినియోగం పెంపు, కార్ల అద్దాల నల్ల ఫిల్మ్‌ తొలగింపు, అతిగా శబ్దం చేసే హారన్ల వినియోగంపై ఆంక్షలు.. ఇలా ఎన్నో సంస్కరణలు రంగనాథ్‌ తీసుకువచ్చారు.

ఆయన అమలు చేసిన జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45తో పాటు ఇతర మార్గాల్లో మళ్లింపులు ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. ట్రాఫిక్‌ విభాగానికి కొత్త చీఫ్‌ వచ్చే వరకు మరో అధికారి ఇన్‌చార్జిగా ఉండనున్నారు.

Related Posts

You cannot copy content of this page