SAKSHITHA NEWS

డ్రగ్స్‌కు కేరాఫ్‌గా గుజరాత్‌

రూ.13,000 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలకు కేంద్రంగా రాష్ట్రానికి చెందిన కంపెనీ

మూడు నెలల్లో 1,200 కేజీలకు పైగా కొకైన్‌ స్వాధీనం

ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు

న్యూఢిల్లీ : గుజరాత్‌లో గత కొంత కాలంగా భారీ ఎత్తున పట్టుబడుతున్న మాదక ద్రవ్యాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా, రాష్ట్రానికి చెందిన ఒక కంపెనీ మాదక ద్రవ్యాలకు కేంద్రంగా నిలుస్తున్నది. తాజాగా, ఢిల్లీ, గుజరాత్‌ పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంకలేశ్వర్‌లోని కెమికల్‌ కంపెనీలో జరిపిన సోదాల్లో పోలీసులు 518 కిలోల కొకైన్‌ను సీజ్‌ చేశారు. దీని విలువ రూ.5,000 కోట్లుగా ఉంటాయని విశ్వసనీయ వర్గాలు అంచనా వేశాయి. ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ ఈ నెల ప్రారంభంలో మహిపాల్‌పూర్‌ గోడౌన్‌ నుంచి 562 కిలో గ్రాముల హైక్వాలిటీ కొకైన్‌, 40 కిలోగ్రాముల హైడ్రోపోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నది. కొన్ని రోజుల వ్యవధిలోనే భారీ ఎత్తున మళ్లీ మాదక పదార్థాలు దొరకటం ఆందోళనను కలిగిస్తున్నది.స్పెషల్‌ సెల్‌లోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గత మూడు నెలలుగా ఇంటెలిజెన్స్‌ ఇన్‌పుట్‌లు, పరిశోధనల ఆధారంగా రూ. 13,000 కోట్ల విలువైన 1,289 కిలోగ్రాముల ప్రీమియం క్వాలిటీ కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పండుగల సీజన్‌, రాబోయే పెద్ద ఈవెంట్‌ల కోసం ఈ డ్రగ్స్‌ దేశంలోకి అక్రమంగా రవాణా చేయబడినట్టు సమాచారం.


రూ. 5,000 కోట్ల మాదకద్రవ్యాల దోపిడీకి కేంద్రంగా గుజరాత్‌కు చెందిన కెమికల్‌ కంపెనీ ఉన్నది. భారత్‌లోకి అక్రమంగా రవాణా చేయబడిన ముడి నిషిద్ధ వస్తువులను శుద్ధి చేయటంలో ఈ కంపెనీ నిమగమైందనీ, దాని కార్యకలాపాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో ప్రమేయం గురించి తీవ్ర ఆందోళనలను లేవనెత్తుతున్నాయని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించి దక్షిణ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త తుషార్‌ గోయల్‌తో సహా ఇప్పటివరకు 12 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలో భాగంగా కంపెనీ సిబ్బంది, యజమానులను ప్రశ్నిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. గోయల్‌, లండన్‌లో ఉండే ఆయన సహచరుడు జతీందర్‌ పాల్‌ సింగ్‌ గిల్‌, నిషిద్ధ సరుకుల రవాణాకు సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. ”గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌కు చెందిన ఓ కంపెనీ డ్రగ్స్‌ను శుద్ధి చేస్తున్నట్టు విచారణలో తేలింది. డ్రగ్స్‌ను మొదట గోవాలో అందుకున్నారు. ఆ తర్వాత సంస్థ యాజమాన్యంలోని కర్మాగారంలో శుద్ధి చేశారు” అని ఢిల్లీ పోలీసుల్లోని కొన్ని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఇతర డ్రగ్స్‌తో పాటు నిషిద్ధ వస్తువులను శుద్ధి చేసి పంపేందుకు కంపెనీ నకిలీ అనుబంధ సంస్థను ప్రారంభించిందని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. మాదకద్రవ్యాలను యూపీకి పెద్ద సరుకులలో పంపించి, ఆ తర్వాత ఢిల్లీకి రవాణా చేశారు. అక్కడ సరుకును నిల్వ చేయటానికి, కొనుగోలుదారులను కనుగొనటానికి గోయల్‌, ఇతరులు బాధ్యత వహిస్తారు.


ఈనెల 1న గోయల్‌కు చెందిన మహిపాల్‌పూర్‌లోని గోదాముపై స్పెషల్‌ సెల్‌ దాడి చేసింది. అక్కడ వారు 562 కిలోల కొకైన్‌, 40 కిలోగ్రాముల హైడ్రోపోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అక్టోబరు 10న తదుపరి విచారణలో ఢిల్లీలోని రమేష్‌ నగర్‌లోని ఒక దుకాణంలో అదనంగా 208 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫార్మా సొల్యూషన్‌ సర్వీసెస్‌కు గుజరాత్‌లోని కంపెనీకి లింక్‌లతో అధికారులు డ్రగ్స్‌ను గుర్తించారు.
ఈ గుజరాత్‌ ఆధారిత కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం ప్రభుత్వేతర కంపెనీగా వర్గీకరించబడింది. దీనిని 2016, సెప్టెంబర్‌ 23న స్థాపించారు. ఈ సంస్థకు ఎలాంటి తయారీ లైసెన్స్‌ లేదని ప్రభుత్వ వర్గాలు తెలపటం గమనార్హం. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం కంపెనీ చివరిగా తన బ్యాలెన్స్‌ షీట్‌ను గతేడాది మార్చి 31న దాఖలు చేసింది. ఈ విషయంలో సదరు కంపెనీ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవటం గమనార్హం.


SAKSHITHA NEWS