
గోవిందుడి రథోత్సవం… భక్తజన సమ్మోహనం
** నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగునా టెంకాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో తత్త్వజ్ఞానమిదే. అనంతరం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి – భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి, నమ్మాళ్వార్ల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌సేవ జరిగింది. రథోత్సవంలో తిరుమల శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ చిన్న జీయర్ స్వామి, ఎఫ్ఎ అండ్ సిఏవో బాలాజి, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవో శాంతి, ఇతర ఇంజినీరింగ్, పలుశాఖల అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నేడే చక్రస్నానం:
శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం(నేడు) ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు (ఆళ్వార్ తీర్థం నందు) స్నపన తిరుమంజనం, చక్రస్నానం వైభవంగా జరుగనుంది. సా. 4.30 గంటలకు స్వామి, అమ్మవార్లు బంగారు తిరుచ్చిపై, చక్రతాళ్వార్ పల్లకీలో ఊరేగింపుగా పిఆర్.తోట నుండి సాయంత్రం 6 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు.
రాత్రి 07 గం.లకు శ్రీవారు ఉభయ నాంచారులతో బంగారు తిరుచ్చినందు చక్రత్తాళ్వార్ లతో నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు జరుగనుంది. అనంతరం రాత్రి 8.40 – 9.30 గం.ల మధ్య ధ్వజావరోహణం మరియు ఆస్థానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
