ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణకు ప్రాధ్యాన్యత ఇవ్వండి

Spread the love

Give priority to the restoration of ancient temples

ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణకు ప్రాధ్యాన్యత ఇవ్వండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక పురాతన ఆలయాలు శిధిలావస్థకు చేరుకుంటున్నాయని, అటువంటి ఆలయాల జీర్ణోద్ధరణకు దేవాదాయ శాఖ ప్రాధాన్యత ఇవ్వాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సూచించారు.

నూతన ఆలయాల నిర్మాణానికి అనేక మంది ధార్మిక వేత్తలు ముందుకొస్తున్నందున జీర్ణోద్ధరణ చేపట్టాల్సిన అవసరమే ఎక్కువగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా శ్రీకూర్మం, ద్రాక్షారామం వంటి ఆలయాల్లో కుంభాభిషేకాలు నిర్వహించాలని సూచించారు.

గురువారం మధ్యాహ్నం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కమిషనర్‌ హరి జవహర్‌లాల్ విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామితో అనేక అంశాలపై చర్చించారు. శాఖాపరంగా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాలను స్వరూపానందేంద్ర స్వామి దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారం కోసం స్వరూపానందేంద్ర స్వామి పలు సూచనలు చేసారు. అర్చకుల వేతనాలు, వంశపారంపర్య హక్కులకు సంబంధించిన పాలనాపరమైన ఇబ్బందులను తొలగించాలని అన్నారు.

స్వధర్మ వాహిని ప్రచార యాత్ర నిమిత్తం ఇటీవల పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి రాయలసీమలో పర్యటించిన సందర్భంగా కదిరి, కసాపురం తదితర క్షేత్రాల్లో భక్తులకు వసతులు లేకపోవడాన్ని గమనించారని, వసతుల కల్పన దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఆలయ భూముల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపైనా స్వరూపానందేంద్ర స్వామి ఆరా తీసారు. స్వరూపానందేంద్ర స్వామి ప్రస్తావించిన అంశాలపై కమిషనర్ హరి జవహర్‌లాల్ సానుకూలంగా స్పందించారు. భూముల విషయంలో రాజీ పడేది లేదని ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్వామీజీకి హామీ ఇచ్చారు.

Related Posts

You cannot copy content of this page