జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో ఇళ్ల నిర్మాణానికి పూర్తి సహకారం : పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే గాంధీ హామీ…
జర్నలిస్టు ఇళ్ల నిర్మాణం కోసం మరో 1 ఎకరా స్థలం మంజూరీ కోసం ప్రయత్నం…
శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గాంధీని కలిసిన జర్నలిస్టులు…
శేరిలింగంపల్లి : తెలంగాణ పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని శేరిలింగంపల్లి మండల జర్నలిస్టులు కలిశారు. శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ టి యు డబ్ల్యూ జే ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టు నాయకులతో కలిసి ఎమ్మెల్యేను కలిసిన జర్నలిస్టులు తమ ఇళ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే గాంధీకి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే గాంధీ సహకారంతో గతంలో చందానగర్ లోని సర్వే నెంబర్ 174లో కేటాయించిన 1 ఎకరం స్థలంలో జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు సహకరించాలని, ఈ స్థలం పక్కనే ఉన్న సర్వే నెంబర్ 152లో మరో 1ఎకరా స్థలాన్ని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం మంజూరీ చేసే విధంగా ఎమ్మెల్యే గాంధీ చొరవ తీసుకోవాలని కోరారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఫైళ్ల విట్ఠల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతో సమావేశమై ఇళ్ల నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ దశాబ్దాలుగా శేరిలింగంపల్లిలో జర్నలిస్టులుగా పనిచేస్తూ సొంత ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల కోసం ఎమ్మెల్యే గాంధీ సహకారంతో చందానగర్ లోని సర్వే నెంబర్ 174లో 1 ఎకరం భూమిని ప్రభుత్వం కేటాయించిందని అన్నారు.
జర్నలిస్టులకు కేటాయించిన భూమిలో ఎమ్మెల్యే గాంధీ చేతుల మీదుగా గతంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. జర్నలిస్టుల ఇళ్ల కోసం కేటాయించిన భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు సహకరించాలని, భూమి కేటాయింపులో ముందుండి మంజూరు చేయించిన ఎమ్మెల్యే గాంధీ ఇళ్ల నిర్మాణంలో సైతం సహకరించాలని కోరారు. శేరిలింగంపల్లిలో జర్నలిస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా పక్కనే ఉన్న సర్వే నెంబర్ 152లో ఉన్న మరో 1 ఎకరా స్థలాన్ని మంజూరు చేయించే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసేందుకు చందానగర్ లో కేటాయించిన భూమిలో ఇళ్ల నిర్మాణం కోసం తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారని తెలిపారు.
చందానగర్ సర్వే నెంబర్ 152లో 1 ఎకరా స్థలం మంజూరు కోసం తాను గతంలో హామీ ఇచ్చానని, సదరు స్థలం జర్నలిస్టుల హౌసింగ్ కోసం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. శేరిలింగంపల్లి మండల జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసేందుకు తాను జర్నలిస్టులకు అండగా ఉంటానని, సమిష్టి కృషితో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుందామని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకులు, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్, టెంజు కార్యవర్గ సభ్యులు, మండల పరిధిలోని జర్నలిస్టులు పాల్గొన్నారు.