
నేటి నుంచి ఏడుపాయల జాతర..!!
పాపన్నపేట, : తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో నేటినుంచి మూడు రోజుల పాటు జరిగే జానపదుల జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి జాతరను ప్రారంభిస్తారు. జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 15లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.
జాతర మొదటి రోజు శివరాత్రి సందర్భంగా భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి దుర్గమ్మను దర్శించుకొని శివదీక్షలు చేపడతారు. సాయంత్రం దీక్షలు విరమిస్తారు. గురువారం ఎద్దుల బండ్లు తిరిగే కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతుంది. మొదట పాపన్నపేట సంస్థానాధీశుల బండి తిరగగా మిగతావి దాన్ని అనుసరిస్తాయి. ఉత్సవాల మూడో రోజు శుక్రవారం రథోత్సవం జరుగుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్, జోగిపేట, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే భక్తులు నర్సాపూర్ మీదుగా పోతన్‌శెట్టిపల్లి నుంచి నూతన బ్రిడ్జిల మీదుగా ఏడుపాయలకు చేరుకోవాలి. మెదక్ వైపు నుంచి వచ్చేవారు ఇదే మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. జహీరాబాద్, బీదర్, నారాయణఖేడ్ వైపు నుంచి వచ్చే భక్తులు బొడ్మట్‌పల్లి మీదుగా నాగసాన్‌పల్లి కమాన్ నుంచి ఏడుపాయలకు చేరుకోవాలి. హైదరాబాద్, నర్సాపూర్, జోగిపేట వైపు నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను రెండో బ్రిడ్జి వద్ద పార్కింగ్ చేసి జాతరకు వెళ్లాల్సి ఉంటుంది. నారాయణఖేడ్ వైపు నుంచి వచ్చే వారు చెలిమెల కుంట వద్ద పార్కు చేయాల్సి ఉంటుంది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app