SAKSHITHA NEWS

||విజయనగరం జిల్లా పోలీసు||

||అశ్లీల వీడియోలతో ‘హానీ ట్రాప్’కు పాల్పడే నేరగాళ్ళ ఉచ్చులో పడవద్దు||

  • విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

మహిళల డిపిలు, వాయిస్, వీడియోలతో వచ్చే కాల్స్ తో ‘హానీ ట్రాప్’లకు పాల్పడే సైబరు నేరగాళ్ళ ఉచ్చులో పడవద్దని,
అటువంటి సైబరు నేరగాళ్ళ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 17న పిలుపు
నిచ్చారు. ‘హానీ ట్రాప్’ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘హానీ ట్రాప్’ షార్టు వీడియోను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – వివిధ సైబరు మోసాలు పట్ల ప్రజలను అప్రమత్తం
చేసేందుకు జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా షార్టు ఫిల్మ్స్ ను రూపొందించి, సైబరు మోసాలు పట్ల అవగాహన కల్పిస్తున్నా
మన్నారు. ఇందులో భాగంగా ‘హనీ ట్రాప్’ పేరుతో కొంతమంది మహిళలు ప్రజలను ఉచ్చులోకి ఏవిధంగా దింపుతారని, ఆయా మోసాల నుండి ఎలా బయటపడాలన్న విషయాన్ని షార్టు ఫిల్మ్ రూపొందించి, నేడు ఆవిష్కరించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ షార్టు ఫిల్మ్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా ప్రజలకు మరింత చేరువ చేసి,
వారిని మరింత అప్రమత్తం చేస్తామన్నారు. ఈ తరహా నేరంలో డబ్బుల కోసం కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని,
వారితో ఫోను, వాట్సాప్ సంభాషనలు, వీడియో కాల్స్ చేసి, ప్రేమ, సెక్స్ పేరుతో ఉచ్చులోకి దించి, వారితో చేసిన
సంభాషణలను, వీడియోలను మార్ఫింగ్ చేసి, అశ్లీలంగా మార్చి, ఆయా వీడియోలను సోషల్ మీడియాలోను పోస్టు చేస్తామని లేదా ఫోను కాంటాక్ట్ ఉన్న ఫోను నంబర్లుకు పంపుతామని బెదిరింపులకు పాల్పడతారని, వీటిని వైరల్ చేయకుండా ఉండాలంటే తాము సూచించిన బ్యాంకు ఖాతాకు లేదా ఫోను నంబరుకు డబ్బులు పంపాలని కోరతారన్నారు.
ఈ తరహా నేరాలకు పాల్పడే వారికి భయపడి, చాలా మంది వ్యక్తులు భారీగా డబ్బులను నష్టపోడం లేదా ఆత్మహత్యలకు
పాల్పడుతున్నారన్నారు. ఇలా బెదిరింపులకు పాల్పడే సైబరు మోసగాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లోను భయపడవద్దని, ఎటువంటి
ఆలస్యం చేయకుండా వారిపై స్థానిక పోలీసు స్టేషనులోను లేదా సైబరు క్రైం పోర్టల్ కు లేదా 1930కు ఫోను చేయాలని ప్రజలకు జిల్లా ఎస్పీ కోరారు. మనకు పూర్తిగా పరిచయం లేని వ్యక్తులతో చాటింగు చేయడం, సంభాషించడం, న్యూడ్ ఫోటోలను పంపడం, వారి ఉచ్చులో పడడం ఈ తరహా నేరాలకు ప్రాధమిక కారణంగా మారుతున్నాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.
కావున, ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని, పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించడం,
‘హానీ ట్రాప్’లో పడకుండా జాగ్రత్తలు చేపట్టడం శ్రేయస్కరమని ప్రజలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ విజ్ఞప్తి చేసారు. ఈ షార్టు వీడీయోను రూపొందించిన విశాఖపట్నంకు చెందిన మీడియా ఎఫెక్స్ సభ్యులను, షార్టు ఫిల్మ్ లో నటించిన పి.హరి
ని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రంను అందజేసారు.

ఈ షార్టు ఫిల్మ్ ఆవిష్కరణ కార్యక్రమంలో విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణరావు, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఎఫెక్స్ మీడియా యజమాని సంతోష్, హరి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

||జిల్లా పోలీసు కార్యాలయం,||
||విజయనగరం.||