స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ చైర పర్సన్ పుట్ట మధూకర్

Spread the love

స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ చైర పర్సన్ పుట్ట మధూకర్ *

……

సాక్షిత పెద్దపల్లి :- జిల్లా పరిషత్ కార్యాలయం లో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధూకర్ నిర్వహించారు.

శనివారం జడ్పీ కార్యాలయం లో చైర్మన్ చాంబర్లో 1వ,2వ,4వ,7వ స్థాయి సంఘాల సమావేశాలను నిర్వహించారు. ఫైనాన్స్ ప్లానింగ్, విద్య వైద్యం గ్రామీణ అభివృద్ధి, గనులఅభివృద్ధి, పనులు సంబంధిత అంశాలపై జడ్పీ చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి జరుగుతున్న పనుల పురోగతి వివరాలను తెలుసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతున్న విధానంపై జడ్పీ చైర్మన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరికీ ప్రభుత్వం రెండు భాషలలో పాఠ్యపుస్తకాలను అందజేసిందని జడ్పీ చైర్మన్ పేర్కొన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద జిల్లాలో ఎంపిక చేసిన 191 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం నుండి అందిన రూ.2 కోట్ల నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి మండలంలో 2 ఆదర్శ పాఠశాలలో పనులు త్వరగా పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ సూచించారు.

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ సూచించారు. కెసిఆర్ కిట్ల పంపిణీ, ఉప ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణ పనులు తదితర అంశాలపై జడ్పీ చైర్మన్ సమీక్షించారు.

గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై చైర్మన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

గ్రామాల్లో పకడ్బందీ పారిశుధ్య చర్యలు చేపట్టి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని జడ్పీ చైర్మన్ సూచించారు.
హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం కనీసం 75% మొక్కల సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. భగీరథ ఎంట్రా విలేజ్ పనుల కింద జిల్లాలో ఇప్పటివరకు రూ.166 కోట్ల పైగా నిధులు ఖర్చు చేసి 321 ఓవర్ హెడ్ ట్యాంకులు, 2038.85 మీటర్ మేర అంతర్గత పైప్ లైన్ , 148106 ఇళ్లలో నల్ల కనెక్షన్ త్రాగునీరు అందిస్తున్నామని వివరించారు. జిల్లాలో ఉన్న 432 గ్రామీణ ఆవాసాలలో త్రావనీటి సరఫరా జరుగుతున్నట్లు పంచాయతీ తీర్మానాలు స్వీకరించామని, మిగిలిన 6 ఆవాసాలకు సంబంధించి తీర్మానాలు సైతం సేకరించాలని జడ్పీ చైర్మన్ సూచించారు.

జిల్లాలో నూతనంగా 26556 పెన్షన్లు మంజూరు చేశామని, ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందే విధంగా అధికారుల చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్ సూచించారు. నూతనంగా చేసిన పెన్షన్లతో కలిపి ప్రతి నెల జిల్లా వ్యాప్తంగా 1,02, 080 మందికి ఆసరా పెన్షన్లను ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 54 బృహత్ పల్లె ప్రకృతి వనాల పూర్తి చేశామని మరో ఆరు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు.

 జడ్పీ వైస్ చైర్ పర్సన్ మండిగ రేణుక, జడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, ఈఈ పంచాయతీ రాజ్ ముని రాజు,  జడ్పీటీసీలు బండారి రాంమూర్తి,తగరం సుమలత,ఆముల నారాయణ, బొద్దుల లక్ష్మీ నర్సయ్య,పూస్కుర్ పద్మజ,వంగల తిరుపతి రెడ్డి కో ఆప్షన్ సభ్యులు మారువాండ్ల దివాకర్ సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page