ఎదురుకాల్పుల్లో మావోయిస్టు హతం
భద్రాద్రి కొత్తగూడెం/తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. గత నెల 28వ తేదీ నుంచి మావోయిస్టు అమరుల వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వారోత్సవాలు ఈ నెల 3వ వరకు జరుగుతాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పోలీస్ బలగాలు ఏజెన్సీ, దండకారణ్యం ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సరిహద్దుల్లోని బోధనెల్లిప అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు మావోయిస్టులు తారస పడ్డారు. ఈ క్రమంలో మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. తక్షణమే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల ధాటికి మావోయిస్టులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారని పోలీసులు వెల్లడించారు.ఈ ఎదురుకాల్పులను భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ధృవీకరించారు. సరిహద్దుల్లోని చత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగుఫా – భద్రాద్రి జిల్లా చర్ల మండలం బోదనెల్లి అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని ఆయన వెల్లడించారు.