
సంక్షేమ పథకాల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
జనవరి 21నుంచి 24 వరకు సంక్షేమ పథకాల లబ్ధిదారుల తుది జాబితా పై నిర్వహించే గ్రామ సభల పై గ్రామాల్లో ముందుగానే చాటింపు చేయించండి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
సాక్షిత వనపర్తి జనవరి 18
సంక్షేమ పథకాల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రారంభించనున్న నాలుగు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేవిధంగా అధికారులు సర్వే చేయాలని సూచించారు.
శనివారం ఉదయం పానగల్ మండలం, చింతకుంట గ్రామం, వీపనగండ్ల మండలం, గోవర్ధన గిరి గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో సర్వే జరుగుచున్న తీరును పరిశీలించారు.
సంక్షేమ పథకాల లబ్ధిదారుల తుది జాబితా వివరాలు వెల్లడించేందుకు, అభ్యంతరాలు స్వీకరించేందుకు జనవరి 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభలు ఏ రోజు ఏ గ్రామంలో నిర్వహిస్తున్నారో ముందుగానే అన్ని గ్రామాల్లో చాటింపు వేయించాలని అధికారులను ఆదేశించారు.
పానగల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో సిబ్బంది సర్వే చేసేందుకు ఎలాంటి డాక్యుమెంట్లు, ఆధారాలు ఇచ్చి పంపించారు, ఇప్పటి వరకు పూర్తి చేసిన లక్ష్యాలను సమీక్షించారు.
రైతు భరోసా పథకంలో వ్యవసాయేతర భూముల్ని ఏవిధంగా గుర్తిస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలను గుర్తించారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పాన్గల్ మండలం చింతకుంట గ్రామాన్ని సందర్శించి సర్వే చేస్తున్న తీరును పరిశీలించారు.సర్వే మరింత వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం వీపనగండ్ల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే పై ఆరా తీశారు. వీపనగండ్ల మండలం గోవర్ధన గిరి గ్రామాన్ని సందర్శించిన కలక్టర్ సర్వే జరుగుచున్న తీరును పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
వీపనగండ్ల మండల ప్రత్యేక అధికారి లక్ష్మప్ప, తహసిల్దార్ వరలక్ష్మి, పానగల్ తహసిల్దార్ సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీఓ లు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు కలక్టర్ వెంట ఉన్నారు.
