ఆశీర్వదించండి.. రాజన్న రాజ్యం తెస్తా : వైఎస్ షర్మిల

Spread the love

ఆశీర్వదించండి.. రాజన్న రాజ్యం తెస్తా : వైఎస్ షర్మిల

*

సాక్షిత అమరచింత*: తెలంగాణలో మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన కావాలంటే ప్రజలు తనను ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గెలిపిస్తే, రాజన్న రాజ్యం తెస్తానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాద యాత్రలో భాగంగా వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని చింతరెడ్డి పల్లె, మిట్టనందిమల్ల, కిష్టంపల్లె, ఆర్ఆర్ సెంటర్ గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తమ తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రైతులకు రుణమాఫీ, ఉన్నత విద్య నభ్యసించే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, లక్షల ఖర్చుతో కూడిన వైద్యాన్ని కూడ ఆరోగ్య శ్రీ పథకం కింద కార్పొరేట్ దవాఖానాల్లో పేదలకు ఉచితంగా అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పేదవారందరికి రేషన్ షాపులో అన్ని రకాల వంట సామాన్లు తక్కువ ధరకే అందించడమే కాకుండా ఉండటానికి ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కుటుంబంలో అర్హులైన వారందరికీ వృద్ధాప్య, వికలాంగులకు పింఛన్లు అందించి ఆదుకున్నారని తెలిపారు. కరువు జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి పాలమూరుకు కల్వకుర్తి నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు నిర్మించి సస్యశ్యామలంగా పంటలకు నీరందించింది రాజశేఖర్ రెడ్డి కాదా.. అని ప్రశ్నించారు. ఆర్టీసీ, కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. మళ్లీ తెలంగాణలో రాజన్న కలలు సాకారం చేసేందుకే నేను 17వందల కిలోమీటర్ల పాద యాత్ర పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చానని ఆమె చెప్పారు. తెలంగాణలో కుటుంబ పార్టీని గెలిపిస్తే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్లేనని, ఈ సారి మీ పిల్లలు కూడా మిమ్మల్ని క్షమించరని హితవుపలికారు. అనంతరం ఆమె పాదయాత్ర జూరాల ప్రాజెక్ట్ మీదుగా జోగులంబ గద్వాల జిల్లాకు ప్రవేశించనుంది.

Related Posts

You cannot copy content of this page