SAKSHITHA NEWS

పేదోడి ఆలోచనకు అనుగుణంగా ఇండస్ట్రీయల్ పార్కు..!!

జయశంకర్ భూపాలపల్లి: పేదోడి ఆలోచనకు అనుగుణంగా గాంధీనగర్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల దీవెనలతో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు రెండు కళ్లు, జోడెడ్ల లాగా సాగుతున్నాయని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన మాట ప్రకారం రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటకు ఇన్స్‌రెన్సు, విత్తనాలకు సబ్సిడీ ఇస్తూ రైతులను రాజులుగా చేస్తున్నామని వెల్లడించారు. శనివారం నాడు భూపాలపల్లి జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క పర్యటించారు. గాంధీనగర్ ఇండస్ట్రీయల్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు కోరిన విధంగా భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తామని తెలిపారు.

ఈ నెల చివరి వరకు 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన ప్రతి గ్రామానికి ఇస్తామని ఉద్ఘాటించారు. కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తామని ఇదిగో అదిగో అని మాయ మాటలు చెప్పి పదేళ్లలో కేవలం 1.50 లక్షల ఇళ్లను మాత్రమే కట్టిందని.. కానీ తమ ప్రభుత్వం మొదటి విడతలోనే 4.50 లక్షల ఇళ్లు కట్టిస్తుందని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పేరు ఎత్తలేదని, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం: మంత్రి సీతక్క

భూపాలపల్లికి ఇండస్ట్రీయల్ పార్క్ రావడం సంతోషకరమని మంత్రి సీతక్క తెలిపారు. ఉద్యోగాల వేటలో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో మారుమూల ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. ఇండస్ట్రీస్ వల్ల భూపాలపల్లి యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తీసుకువచ్చి ఎందరినో ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమాతను తెచ్చి విజయవంతంగా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. జాబ్ క్యాలెండర్ తెచ్చామని చెప్పారు. స్కిల్ ఇండియా ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ జరిగిందని గుర్తుచేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓకే సారి రూ. 2లక్షల రుణమాఫీ చేశామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

బీఆర్ఎస్ నేతలు అలా మాట్లాడటం సరికాదు: మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వ బాధ్యతలు విస్మరించకుండా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. భూపాలపల్లి జిల్లాలో నీటి వనరులు, ఖనిజ సంపద ఉందని చెప్పారు. అశాస్త్రీయ బద్ధంగా మేడిగడ్డ బ్యారేజి కడితే కుంగిపోవడం ప్రజలంతా చూశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర చేసిందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదని చెప్పారు. అధికారులను ప్రజల వద్దకు తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు.

అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. మంత్రి సీతక్క , సీఎం రేవంత్ రెడ్డి మహిళలను లక్షాధికారులను చేస్తామంటే ప్రతిపక్షాలు విమర్శలు చేశాయని మండిపడ్డారు. ఈ రోజు కోటి మందిని స్వశక్తి మహిళా గ్రూపు సభ్యులుగా చేర్చి మహిళలను లక్షాధికారులు చేయడానికి ప్రణాళికలు రూపొందించామని అన్నారు. ఎమ్మెల్యేలు ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కష్టపడ్డారని అన్నారు. 200 పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. మొట్టమొదటి పరిశ్రమకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఐటీ రంగ ఉద్యోగులు కూడా జిల్లాల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీలు కావాలని కోరుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు..


SAKSHITHA NEWS