
ప్రాణం తీసిన సిగరెట్…మంచానికి నిప్పంటుకొని వృద్ధుడి దుర్మరణం
ధూమపానానికి బానిసైన ఓవృద్ధుడు చివరకు తను కాలుస్తున్న సిగరెట్ మంచానికి అంటుకొని అగ్నిప్రమాదానికి గురై మృత్యువాత పడిన ఘటన గుడివాడలో చోటుచేసుకుంది.
పట్టణంలోని ద్రోణాదు లవారి వీధికి చెందిన చల్లా వెంకటేశ్వరరావు(71) కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధ పడుతూ మంచానికి పరిమితమయ్యారు. ఆయనకు భార్య సావిత్రమ్మ, కుమారుడు శ్రీను, ఇద్దరు కుమార్తెలున్నారు.
ఆయనకు ధూమపానం అలవాటుంది. ఉదయం సిగరెట్ వెలిగించి నిద్రలోకి జారుకున్నాడు. అదే సమయంలో ఆయన భార్య అల్పాహారం కోసం బయటకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సిగరెట్ పీకకు ఉన్న నిప్పు ప్లాస్టిక్ నవ్వారు మంచానికి అంటుకొని అగ్ని ప్రమాదానికి గురయ్యారు. కొద్ది సేపటికి అల్పాహారం తీసుకొని భార్య ఇంటికొచ్చారు. అప్పటికే మంటల్లో చిక్కుకున్న భర్తను ఇరుగు పొరుగువారి సాయంతో రక్షించి 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
వెంకటేశ్వరరావు శరీరం 60 శాతానికి పైగా కాలిపోయినట్లు వైద్యుడు కృష్ణయాజీ గుర్తించి విజయవాడ తరలించాలని సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తుండగా అక్కడే చికిత్స పొందుతూ కొద్ది సేపటికే వెంకటేశ్వరరావు మరణించారు.
కాలిన గాయాలతో నరక యాతన అనుభవిస్తూ మృతి చెందడం చూపరుల్ని కంట తడి పెట్టించింది. సిగరెట్ అలవాటు వల్ల లేవలేని స్థితిలో ఈ ప్రమాదం బారిన పడి వెంకటేశ్వరరావు మృతి చెందడంతో స్థానికంగా. విషాదం నెలకొంది.
