SAKSHITHA NEWS

బయోట్రిమ్ వద్ద పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టండి. కమిషనర్ ఎన్.మౌర్య

నగరపాలక సంస్థ పరిధిలోని కరకంబాడి రోడ్డు మార్గంలో గల బయో ట్రిమ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని ఇంజినీరింగ్, హెల్త్ అధికారులను కమిషనర్ ఎన్.మౌర్య ఆదేశించారు. ఉపాద్యాయ నగర్ రోడ్డు, బయో ట్రిమ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, మురుగు నీటి కాలువల నిర్మాణం పై ఇంజినీరింగ్, హెల్త్, ప్లానింగ్ అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బయో ట్రిమ్, ఉపాద్యాయ నగర్ రోడ్డు మధ్య ఉన్న మురుగునీటి కాలువ సరిగా లేనందున అపరిశుభ్రత ఎక్కువగా ఉందని, వీధికుక్కలు లోనికి వస్తున్నాయని, జింకలు, దుప్పులు రోడ్లపై వస్తున్నాయని బయో ట్రిమ్ అధికారులు, ప్రజలు పిర్యాదు చేశారని అన్నారు. ఈ మేరకు తనిఖీ కూడా చేయడం జరిగిందన్నారు.

మానస సరోవర్ నుండి వినాయక సాగర్ వరకు ఉన్న మురుగు నీటి కాలువను నిర్మించాలని ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే గోవింద ధామం ఎదురుగా చిన్న చిన్న దుకాణాలు ఉండడం వలన జింకలు, వాటికోసం చిరుత పులులు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ దుకాణాలను తొలగించేలా చర్యలు చేపట్టాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. బయో ట్రిమ్, తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, వీధి కుక్కలు రాకుండా చర్యలు తీసుకోవాలని హెల్త్, వెటర్నరీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.సి.పి. మాహాపాత్ర, డి.ఈ.లు, ఏ.సి.పి.లు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS