SAKSHITHA NEWS

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మచెరువు పరిసర ప్రాంతాల ప్రజలు మరియు జయనగర్ కాలనీ వాసులు దోమల బెడద సమస్య ఎక్కువగా ఉందని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి దోమల నివారణ కొరకు MLO ఆయిల్ బాల్స్ ను చెరువులో వేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దోమల నివారణకు ఆయిల్‌ బాల్స్‌ ను చెరువులో వేయడం వల్ల లార్వ దశలోనే దోమలు మృతి చెందుతాయి కాబట్టి వ్యాప్తి జరగకుండా నియంత్రించవచ్చని అన్నారు.

ఎల్లమ్మచెరువులో గుర్రపు డెక్క పెరిగి దోమలు విపరీతంగా వ్యాప్తి చెందడంతో డివిజన్ లో దోమల సమస్య ఎక్కువైంది అని అన్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా చెరువులోని గుర్రపు డెక్క మొత్తాన్ని తొలగించి చెరువుని శుభ్రం చేసే విషయమై శేరిలింగంపల్లి శాసనసభ్యులు పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, రాజిరెడ్డి, ఉమామహేశ్వరరావు, కృష్ణారావు, రాజేష్, పోశెట్టిగౌడ్, శ్రీనివాసరావు, ప్రసాదరావు, ఎంటమాలజి సూపర్వైజర్ డి.నరసింహులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.